
కర్ణాటక ఎన్నికల బరిలోకి దిగిన మాజీ పీఎం HD దేవెగౌడ మనవడు, మాజీ సీఎం కుమారస్వామి కొడుకు హీరో నిఖిల్ గౌడ ఓటమిపాలయ్యాడు. రామనగర నుంచి పోటీ చేసిన నిఖిల్ కుమార గౌడ.. కాంగ్రెస్ అభ్యర్ధి చేతిలో ఓటమిపాలయ్యాడు.
కుమారస్వామి భార్య రామనగర నుంచి టికెట్‌ను త్యాగం చేసి నిఖిల్ కుమారగౌడకు అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థి ఇక్కడ ఏకంగా పదివేల ఓట్ల మెజారిటీని ఇప్పటికే సాధించాడు. దీంతో నిఖిల్ కు ఓటమి ఖాయమైనట్టే. రామనగరం స్థానం నుంచి నిఖిల్ గౌడ (జేడీఎస్) ఇక్బాల్ హుస్సేన్ (కాంగ్రెస్) మరిలింగగౌడ (బీజేపీ) పోటీపడ్డారు. ఈ త్రిముఖపోటీలో కాంగ్రెస్ అభ్యర్ధి విజయం దశగా దూసుకుపోతున్నారు. అయితే 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఇక్బాల్ హుస్సేన్‌పై జేడీ(ఎస్) అభ్యర్థి హెచ్‌డీ కుమారస్వామి విజయం సాధించడం విశేషం. రామనగర అసెంబ్లీ స్థానంలో జేడీఎస్‌కి మంచి పట్టు ఉంది.. అందుకే కొడుకుని బరిలోకి దింపారు మాజీ సీఎం కుమారస్వామి. అయితే పట్టున్న ప్రాంతంలో కూడా పట్టు నిలుపుకోలేక ఓటమి చవిచూశారు నిఖిల్ గౌడ. 2019లో మండ్య లోక్‌సభ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో పోటీ చేసిన నిఖిల్.. సుమలత చేతిలో ఓడిపోయారు.
నిఖిల్ గౌడ.. సినిమా హీరోగానూ ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. జాగ్వార్, రైడర్, సీతారామకళ్యాణ, కురుక్షేత్ర వంటి చిత్రాల్లో నటించారు. 2016లో నిఖిల్ గౌడ నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘జాగ్వార్’ని తెలుగులో కూడా విడుదల చేశారు. అయితే ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దాదాపు వంద కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రానికి రాజమౌళి తండ్రి, బాహుబలి కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు. ఎ మహదేవ్ దర్శకత్వం వహించారు. అయితే ఈ భారీ బడ్జెట్ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ అయ్యింది. ఇక సినిమాల నుంచి యూటర్న్ తీసుకుని రాజకీయాల్లోకి వెళ్లిన ఈ కన్నడ జాగ్వార్.. అక్కడ కూడా ఓటమి పాలయ్యారు.