
కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి 15న ప్రమాణస్వీకారం చేయనున్నారు. 224 అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్ర అసెంబ్లీలో 136 స్థానాల్లో గెలుపొందింది. భారీ విజయంతో ఆ పార్టీ సంబురాల్లో మునిగిపోయింది. మరో వైపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. కొత్త ముఖ్యమంత్రి ఈ నెల 15న ప్రమాణం స్వీకారం చేయనున్నట్లు తెలుస్తున్నది. కంఠీరవ స్టేడియంలో సీఎం ప్రమాణస్వీకారానికి కాంగ్రెస్ ఏర్పాట్లు చేస్తున్నది. అయితే, ఎవరు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొన్నది. ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యతో పాటు పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ రేసులో ఉన్నారు. ఈ క్రమంలో ఎవరు బాధ్యతలు స్వీకరిస్తారన్నది ఆదివారం ఖరారుకానున్నది. రేపు బెంగళూరులో సీఎల్పీ సమావేశం కానున్నది. సీఎల్పీ నేతను ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. బెంగళూరులోని హిల్టన్ హోటల్‌లో మధ్యాహ్నం 12.30 గంటలకు సీఎల్పీ సమావేశం జరుగనున్నది.
ఎన్నికల్లో ఫుల్ మెజారిటీ సాధించిన కాంగ్రెస్ పార్టీ కొత్త సీఎం ఎంపికపై దృష్టి సారించింది. ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలంతా బెంగళూరు రావాలని ఆదేశించింది. బెంగళూరులో ఆదివారం జరిగే సీఎల్పీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకోనున్నారు. కొత్త సీఎం ఎవరనేది హైకమాండ్ నిర్ణయిస్తుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నేత సిద్ధరామయ్యతో పాటు పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పీఠాన్ని ఆశిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో డీకే శివకుమార్ పార్టీ గెలుపు కోసం విశేషంగా కృషి చేశారు. పీసీసీ చీఫ్‌గా ముందుండి నడిపించారు. ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం రోజునే డీకే శివకుమార్ పుట్టిన రోజు కావడం విశేషం.