
తన స్నేహితురాలిని హగ్ చేసుకున్నాడు.. ఆ తర్వాత పిస్టల్‌తో కాల్పులు జరిపి ఆమెను హత్య చేశాడు. అనంతరం అతడు కూడా గన్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీ శివారు ప్రాంతమైన ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో జరిగింది. శివ్ నాడార్ యూనివర్సిటీ క్యాంపస్‌లో బీఏ సోషియాలజీ మూడో ఏడాది చదువుతున్న 21 ఏళ్ల అనుజ్ సింగ్ గురువారం మధ్యాహ్నం 1.30 గంటలకు డైనింగ్ హాల్ బయట స్నేహితురాలైన స్నేహ చౌరాసియాను కలిశాడు. అక్కడ వారిద్దరూ కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నారు. ఆ తర్వాత అనుజ్ ఒక గిఫ్ట్ ప్యాక్‌ను ఆమెకు ఇచ్చాడు.
ఆ గిఫ్ట్‌ను తీసుకునేందుకు స్నేహ నిరాకరించింది. దీంతో ఉన్నట్టుండి అనుజ్ పిస్టల్ తీసి మొదట ఆమె కడుపుపై కాల్పులు జరిపాడు. ఈ నేపథ్యంలో అతడ్ని ప్రతిఘటించేందుకు ఆమె ప్రయత్నించింది. అయితే అనుజ్ మరోసారి కాల్పులు జరుపగా ఆమె కిందపడిపోయింది. ఆ తర్వాత అతడు బాయ్స్ హాస్టల్‌కు పరుగుతీశాడు. తన రూమ్‌కు వెళ్లి గన్‌తో తలపై కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనికి ముందు ‘నా సూసైడ్ నోట్’ పేరుతో యూనివర్సిటీ గ్రూప్‌లో ఒక నోట్‌ను పోస్ట్ చేశాడు. తీవ్రంగా గాయపడి రక్తం మడుగుల్లో పడి ఉన్న స్నేహాను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనుజ్ రూమ్‌లోని పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు.