
కోర్టు ప్రాంగణంలో ఇద్దరు న్యాయవాదులు కొట్టుకున్నారు. మహిళా లాయర్ చెంపపై మగ న్యాయవాది కొట్టగా ఆమె తిరిగి అతడిని కొట్టింది. దేశ రాజధాని ఢిల్లీలోని రోహిణి కోర్టులో ఈ సంఘటన జరిగింది. గురువారం లాయర్లు విష్ణు కుమార్ శర్మ, నేహా గుప్తా మధ్య ఒక విషయంపై వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా నేహా గుప్తా చెంపపై విష్ణు కుమార్ రెండు సార్లు కొట్టాడు. దీంతో ఆమె ఎదురుతిరిగింది. అతడిని కొట్టగా తిరిగి ఆమెను కొట్టాడు. వారిద్దరి మధ్య కోట్లాట తీవ్రం కావడంతో అక్కడున్న మిగతా న్యాయవాదులు జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ వారిద్దరూ వెనక్కి తగ్గలేదు. ఒకరిపై మరొకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు.
ఈ సంఘటన తర్వాత విష్ణు కుమార్ శర్మపై నేహా గుప్తా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నెల 18న కోర్టు రూమ్ వద్ద ఉన్న తనపై ఆ న్యాయవాది అకారణంగా దాడి చేసినట్లు ఆరోపించింది. ఈ దాడిలో తన ముఖంతోపాటు శరీరంపై పలు గాయాలైనట్లు ఫిర్యాదులో పేర్కొంది. దీంతో ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు లాయర్ల మధ్య ఫైట్ సందర్భంగా అక్కడున్న కొందరు తమ మొబైల్ ఫోన్‌లో రికార్డ్ చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.