
వీల్‌ఛైర్‌పైనే సివిల్ పరీక్షలకు సిద్ధమైంది. సివిల్ సర్వీస్ ఎగ్జామ్‌లో ర్యాంక్ వచ్చిందని హాస్పిటల్ బెడ్‌పై షెరిన్ షహనాకు తెలియడంతో ఆమె ఆనందానికి అవధులు లేవు. కేరళలోని వయనాద్‌కు చెందిన పాతికేండ్ల షహన ఇటీవల జరిగిన కారు ప్రమాదంలో భుజానికి గాయం కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. సివిల్స్‌లో టాప్ ర్యాంక్ రాకున్నా షెరిన్‌కు 913వ ర్యాంకు రావడం కూడా ఆషామాషీగా వచ్చినదేం కాదు.
చావును చూసే ప్రమాదాలను ఎదురొడ్డి తల్లి, సోదరి సాయంతో ఇంతవరకూ వచ్చింది. 2017లో ఆమె తన ఇంటి టెర్రేస్‌పై ఆరిన బట్టలు తీస్తుండగా అక్కడి నుంచి కిందపడటంతో ఆమె ప్రపంచం తలకిందులైంది. దీంతో ఆమె వెన్నుకు తీవ్ర గాయం కాగా, ఆమె భుజాలు, దిగువ శరీరభాగాలు కదలలేని స్ధితికి చేరాయి. నిలువెల్లా గాయాలతో రెండేండ్ల వరకూ ఆమె మంచానికే పరిమితమైంది. 2015లో తండ్రిని కోల్పోవడంతో షహనాకు సరైన చికిత్స అందించలేకపోయారు.
తల్లి, సోదరి జలిషా ఉస్మాన్ ప్రోత్సహంతో షహనా తన సివిల్ సర్వీస్ కలను వదులుకోకుండా వీల్‌ఛైర్‌పైనే పరీక్షలకు సిద్ధమైంది. తన మెమరీని కోల్పోయిన షహనా ఆపై లెటర్స్ నుంచి తన ప్రస్ధానం మొదలుపెట్టింది. ఆన్‌లైన్‌లో చదువుతూ నెట్, పొలిటికల్ సైన్స్‌లో జేఆర్ఎఫ్‌ను క్లియర్ చేసింది. కాలికట్ యూనివర్సిటీ నుంచి ప్రస్తుతం పీహెచ్‌డీ చేస్తోంది. సివిల్ సర్వీసెస్‌కు పోటీ పడే దివ్యాంగుల కోసం ఆబ్సల్యూట్ ఐఏఎస్ అకాడమీ ఆన్‌లైన్ కోచింగ్‌కు రెండేండ్ల కిందట షహనా ఎన్‌రోల్ అవడంతో ఆమె సివిల్స్ కల సాకారమైంది. మళయాళంలో సివిల్స్‌ను అటెంప్ట్ చేసిన షహనా రచయిత సాయంతో ఎగ్జామ్‌ను క్లియర్ చేసింది.