
మనిషి సాధించాలని నిర్ణయించుకొని లక్ష్యం వైపు అడుగులు వేస్తే విజయం వశమవుతోంది. అలాంటిది ఒక పోలీస్ కానిస్టేబుల్ ఇటీవల విడుదలైన సివిల్స్ ఫలితాల్లో 667 ర్యాంకు సాధించి పలువురి ప్రశంసలు అందుకుంటున్నాడు. తాను పోలీసు ఉద్యోగంలో చేరినప్పుడు యూపీఎస్సీ పదానికి అర్థమేంటో తెలియని తనకు.. ఇప్పుడే అదే యూపీఎస్సీ నిర్వహించిన సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్‌లో 667 ర్యాంకు సాధించడం ఎంతో సంతోషంగా ఉందని అంటున్నాడు రామ్ భజన్.
రాజస్థాన్‌కు చెందిన రామ్ భజన్ 2009లో ఢిల్లీ పోలీసు సర్వీసులో ఉద్యోగం సంపాదించాడు. ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ విభాగంలో రామ్ భజన్ విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే 2015లో తన డిపార్ట్‌మెంట్‌లో పని చేసే పోలీసు ఉన్నతాధికారి ఒకరు సివిల్స్ ఫలితాల్లో సత్తా చాటాడు. ఆయనను ప్రేరణగా తీసుకున్న రామ్ భజన్.. యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్ పరీక్షలపై దృష్టి సారించాడు. అప్పుడే యూపీఎస్సీ గురించి తెలుసుకున్నాడు. ఆ పరీక్షలకు కావాల్సిన సమాచారాన్ని సేకరించాడు. ఇక తన ప్రయత్నం మొదలు పెట్టాడు. వరుసగా ఏడు సార్లు విఫలమయ్యాడు. ఎనిమిదో సారి సివిల్స్ క్లియర్ చేసి.. 667 ర్యాంకు సాధించి అందరి నుంచి మన్ననలు పొందుతున్నాడు. ఈ విజయం వెనుకాల తన తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో ఉందని రామ్ భజన్ పేర్కొన్నాడు. తన తల్లిదండ్రులు రోజువారి కూలీలు అని తెలిపాడు.