
ప్రజాబలం ఉన్న లేకున్న కొంతమంది నాయకుల చేస్తున్న ఉద్యమాలు ఆసక్తికరంగా ఉంటాయి. తెలంగాణలో షర్మిళ ఎన్ని ఉద్యమాలు చేసిన ప్రజాదరణ మాత్రం అనుకున్నంతగా పెరగడం లేదు. ఐనా ఆవిడ రాష్ట్రంలోని వివిధ అంశాలపై పోరాటం మాత్రం ఆపడం లేదు. నిత్యం ఏదో ఒక సమస్యపై ప్రచారంలో మాత్రం ఉంటుంది. వైఎస్ఆర్ టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గురించి కొత్తగా ఎవరికీ పరిచయం చేయాల్సిన అవసరంలేదు. తెలంగాణాలో పార్టీపెట్టి సుమారు రెండేళ్ళవుతోంది. అప్పటినుండి ఒంటరిప్రయాణమే చేస్తున్నారు. ఒకవైపు కేసీయార్ ప్రభుత్వంపైన మరోవైపు బీజేపీ పైన తన పరిధిలో ఆరోపణలు, విమర్శలతో నానా రచ్చచేస్తున్నారు. ఆమెచేసే ఆరోపణలు, విమర్శలు ఒక్కోసారి హద్దులు దాటిపోయి గొడవలవలు కూడా అవుతున్నాయి. షర్మిలపై యాక్షన్ తీసుకోవాలని ఏకంగా మంత్రులే స్పీకర్ కు ఫిర్యాదు కూడా చేశారు.
అలాంటి షర్మిల రాబోయే ఎన్నికల్లో ఒంటరిపోరాటానికే రెడీ అవుతున్నారు. ఎవరితోను పొత్తు పెట్టుకునేది లేదని ప్రకటించారు. తమ పార్టీ 43 నియోజకవర్గాల్లో పోటీ చేసే అవకాశం ఉంది అంటున్నారు. ఢిల్లీలోని ఒక సంస్ధతో సర్వేచేయిస్తే 43 నియోజకవర్గాల్లో తమ పార్టీ గట్టి ఫోర్స్ గా ఉందని తేలిందని చెప్పారట. అంటే షర్మిల ప్రకటన ప్రకారం 43 సీట్లలో తన పార్టీ పోటీచేయవచ్చనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. షర్మిళ మాత్రం ఖమ్మం జిల్లా పాలేరులో పోటీచేస్తున్నట్లు ప్రకటించారు. ఒక్కసీటులో అయినా షర్మిలపార్టీ గెలుస్తుందో లేదో తెలీదు కానీ ఆమెలో ఆత్మవిశ్వాసం మాత్రం ఎక్కువగానే కనబడుతోంది.
అలాంటిది ఏపిలోని పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే మాత్రం జనసేన పార్టీ పెట్టి పదేళ్లు అవుతోంది. ఐనా ఇప్పటికి ఒంటరిగా పోటీచేయాలంటే భయపడుతున్నారు. పొత్తులేనిదే తాను పోటీచేసే అవకాశం లేదని స్వయంగా పవనే చెప్పారు. జనసేన ఒంటరిగా పోటీచేస్తే వీరమరణం తప్పదని తానే ప్రకటించుకున్నారు. ఎన్నిసీట్లలో పోటీచేస్తారో తెలీదు. ఎన్ని నియోజకవర్గాల్లో పార్టీ గట్టిగా ఉందో చెప్పలేరు. చివరకు తాను ఏ నియోజకవర్గంలో పోటీచేస్తారనే విషయాన్ని కూడా చెప్పలేకపోతున్నారు. కేసీఆర్ ప్రభుత్వం మీద షర్మిల పోరాటం చేస్తున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద పవన్ ఒక్కరోజు కూడా పోరాటం చేయలేదు.
ఎప్పుడైనా బహిరంగసభ లేదా పార్టీనేతల సమావేశంలో మాట్లాడినపుడు జగన్ పైన నోటికొచ్చింది మాట్లాడేయటం, పూనకం వచ్చినవాడు ఊగినట్లు ఊగిపోవటం, ఏమి మాట్లాడుతున్నారో కూడా అర్ధంకాకుండా ఏదేదో మాట్లాడడం, వెళ్ళిపోవటం. మళ్ళీ ఎప్పుడు కనిపిస్తారో ఎవరికీ తెలీదు. పార్టీ పెట్టింది తెలంగాణాకు సీఎం కావటానికే అని షర్మిల ప్రకటించినట్లుగా కూడా పవన్ ప్రకటించలేకపోయారు. పైగా పొత్తులో ముఖ్యమంత్రి పదవి తీసుకునేంత సీన్ తనకు లేదని తనకు తానే ప్రకటించేసుకుని చంద్రబాబునాయుడుకు సరెండర్ అయిపోవటమే విచిత్రం. మొత్తానికి షర్మిలకున్న ధైర్యం, షర్మిళ చేసే పోరాటం పవన్ ఆంధ్రాలో ఎందుకు చేయలేకపోతున్నాడనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అది జనసైనికుల్లో నిరాశను నింపుతోంది.