
స్నేహం అంటే ప్రాణమిచ్చేవారు ఉంటారని వింటాం.. కాని తన ప్రాణస్నేహితుడి మరణాన్ని తట్టుకోలేకపోయిన ఒక వ్యక్తి స్నేహితుడి చితిలో దూకి చనిపోయాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ జిల్లాలో జరిగింది. నాగ్లా ఖంగార్ ప్రాంతానికి చెందిన 42 ఏళ్ల అశోక్ కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. శనివారం ఉదయం అతడు మరణించాడు. ఈ నేపథ్యంలో ఉదయం 11 గంటలకు యమునా నది ఒడ్డున ఉన్న శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. అశోక్ స్నేహితుడైన 40 ఏళ్ల ఆనంద్ కూడా అంత్యక్రియలకు హాజరయ్యాడు.
అశోక్ మృతదేహానికి చితి వెలిగించిన తర్వాత బంధువులు అక్కడి నుంచి వెళ్లసాగారు. ఇంతలో ఆనంద్ ఉన్నట్టుండి ఒక్కసారిగా స్నేహితుడి చితిపైకి దూకాడు. సహగమనానికి యత్నించాడు. అక్కడున్న వారు గమనించి వెంటనే అతడిని చితి పైనుంచి బయటకు లాగారు. అప్పటికే ఆనంద్ శరీరానికి మంటలు అంటుకోవడంతో తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి. మరోవైపు ఆనంద్‌ను తొలుత జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి అతడిని తరలించారు. పరిశీలించిన వైద్యులు ఆగ్రా మెడికల్ కాలేజీ హాస్పిటల్‌కు రిఫర్ చేశారు. అతడిని అక్కడకు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. స్నేహితుడి మరణాన్ని తట్టుకోలేక సహగమనానికి ఆనంద్ పాల్పడం గురించి తెలుసుకుని స్థానికులు నివ్వెరపోయారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.