
వరంగల్‌లోని పలు ఆసుపత్రుల్లో లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయని పోలీసులకు పలు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఆయా ఆస్పత్రులపై నిఘా పెట్టిన పోలీసులు.. లింగ నిర్ధారణ ద్వారా గర్భస్రావాలు చేస్తున్న 18 మందిని అరెస్టు చేసినట్లు వరంగల్ పోలీసు కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. వీరి నుంచి 18 సెల్‌ఫోన్లు, రూ. 73 వేలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
లింగ నిర్ధారణ ద్వారా గర్భస్రావాలు చేస్తున్న లోటస్ ఆస్పత్రి యజమాని, వైద్యులను అరెస్టు చేశామని సీపీ పేర్కొన్నారు. నర్సంపేట కేంద్రంగా పెద్ద ఎత్తున దందా జరగుతోందన్నారు. ఆయుర్వేద వైద్యులు కూడా గర్భస్రావాలు చేస్తున్నారని తెలిపారు. ఈ చర్యలకు పాల్పడుతున్న వైద్యులు, సిబ్బంది అందరినీ పట్టుకుంటామని స్పష్టం చేశారు. త్వరలోనే వైద్య శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి తగు చర్యలు తీసుకుంటామన్నారు. గర్భస్రావాల కోసం ఒక్కొక్కరి నుంచి రూ. 30 వేలు వసూలు చేస్తున్నట్లు తమ పరిశీలనలో తేలిందని సీపీ పేర్కొన్నారు.
పోలీసులు అరెస్టు చేసిన వారిలో వేముల ప్రవీణ్, వేముల సంధ్యారాణి, డాక్టర్ బాల్నె పార్ధు, డాక్టర్ మోరం అరవింద, డాక్టర్ మోరం శ్రీనివాస్ మూర్తి, డాక్టర్ బాల్నె పూర్ణిమ, వార్ని ప్రదీప్ రెడ్డి, కైత రాజు, కల్లా అర్జున్, డీ ప్రణయ్ బాబు, కీర్తి మోహన్, బాల్నె అశలత, కొంగర రేణుక, భూక్యా అనిల్, చెంగెల్లి జగన్, గన్నారపు శ్రీలత, బండి నాగరాజు, కాసిరాజు దిలీప్ ఉన్నారు. మరికొద్ది మంది నిందితులు పరారీలో వున్నారు.