
రాజకీయంలో ఎవరి ఆలోచన ఎప్పుడు ఏలా మారుతుందో తెలియదు.. మిత్రుడు, శత్రువు అవుతారు, శత్రువు మిత్రుడుగా మారుతారు.. ఒకప్పుడు సభ ఏదైనా.. వేదిక మరేదైనా సరే అటు కేంద్రాన్ని.. కేంద్రంలోని బీజేపీ సర్కారును.. ప్రధాని నరేంద్ర మోడీని.. కమలం పార్టీ నాయకులను తన పదునైన మాటలతో విరుచుకుపడే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలలో కాస్త మార్పు వచ్చినట్లుగా కనిపిస్తోంది. తాజాగా నిర్మల్ జిల్లా ఎల్లపల్లిలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభలో మాట్లాడిన ఆయన బీజేపీ ఊసే రాకుండా కాంగ్రెస్ పార్టీని.. ఆ పార్టీ నేతలనే టార్గెట్ చేస్తూ చేసిన విమర్శలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. తెలంగాణ రాజకీయాల్లో మారిన ముఖచిత్రానికి నిలువెత్తు నిదర్శనమన్నట్లుగా తెలుస్తోంది.
ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని కాంగ్రెస్ నాయకులు అంటున్నారని.. కానీ ఆ దుర్మార్గుల్నే బంగాళాఖాతంలో విసిరేయాలంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చాలాకాలంగా అధికారానికి దూరమయ్యారు కాబట్టి.. మళ్లీ అధికారంలోకి వస్తే పంటికి అంటకుండా అంతా మింగేయాలని వారు చూస్తున్నట్లు ఆరోపించారు. యాభై ఏళ్లు పాలించి తాగునీరు కూడా ఇవ్వలేకపోయారని.. అలాంటి వారిని మళ్లీ రానిస్తామా.. అంటూ ప్రశ్నించిన ఆయన.. దీనిపై ప్రజలే తేల్చుకోవాలని వ్యాఖ్యానించారు.
గతంలో రెవెన్యూ శాఖలో భయంకరమైన దోపిడీ జరిగేదని.. ఎవరి భూమి ఎవరి చేతుల్లో ఉండేదో తెలిసేది కాదన్న ఆయన.. తెల్లారేసరికి పహాణీలు మారిపోయేవని.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. మళ్లీ ఇప్పుడు ధరణిని తీసేసి మళ్లీ అక్రమాలు చేయాలని వారు చూస్తున్నారు. ప్రస్తుతం భూముల రిజిస్ట్రేషన్ 15 నిమిషాల్లో జరిగిపోతోంది. పట్టా కావాలంటే పది నిమిషాల్లో అవుతుంది. ధరణిని తీసేసి మళ్లీ ఎన్ని రోజులు తిరగాలి.. రైతుబంధు.. రైతుబీమా ఎలా వస్తుంది.. వడ్లు కొనుగోలు చేస్తే. డబ్బులు ఖాతాల్లోకి ఎలా వేయగలుగుతారు.. మీరే తెలుసుకోవాలి. ధరణి ఉండాలో.. తీసివేయాలో ప్రజలంతా గట్టిగా చెప్పాలి’’ అంటూ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పాలన వస్తే కరెంటు కోతలు ఖాయమన్నారు.
తన మొత్తం 20 నిమిషాల ప్రసంగంలో బీజేపీని పల్లెత్తు మాట అనని కేసీఆర్.. తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల గురించి.. చేసే కార్యక్రమాల గురించి చెప్పుకొచ్చారు. కొద్దిరోజుల్లోనే బాసర సరస్వతి అమ్మవారి ఆలయాన్ని పెద్ద ఎత్తున డెవలప్ చేసుకుందామని.. కొద్ది రోజుల్లోనే ఆ పనులకు పునాది రాయి వేసేందుకు తానే వస్తానని వెల్లడించారు. భారత దేశమంతా తెలంగాణ మోడల్ మార్మోగిపోతోందని పేర్కొన్నారు. అభివృద్ధికి సూచికలుగా పేర్కొనే పర్ క్యాపిటా ఆదాయం విద్యుత్ పర్ క్యాపిటాలో దేశంలోనే తెలంగాణ ఎంతో పురోగమించిందన్నారు.
ఒకప్పుడు బిజెపి పార్టీనే ప్రధాన టార్గెట్ చేస్తూ మాటలను తూటాలుగా మార్చిన కెసిఆర్ ఇప్పుడు తన రూట్ మార్చిండా అనిపిస్తోంది. కర్నాటకలో కాంగ్రెస్ పార్టీలాగా, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలను అడ్డుకోవాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే బిజెపికి ఇప్పటికి చాలా ప్రాంతాల్లో సరియైన క్యాడర్ లేదు. కాంగ్రెస్ తెలంగాణలో కాస్త పుంజుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అది ఎదగకుండా చేయాలన్నదే ఇప్పుడు కెసిఆర్ ముందున్న ప్రధాన టార్గెట్ గా కనిపిస్తోంది.