
మైక్రోసాఫ్ట్ కంపెనీ అధినేత సత్య నాదెళ్ల 2.5 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ కలిగిన మైక్రోసాఫ్ట్ కంపెనీని నడుపుతున్నాడు. ఆయన నికర విలువ రూ.6,200 కోట్లుగా ఉంది. అలాగే FY 21-22లో సత్యనాదెళ్ల వార్షిక పరిహారం 54.9 మిలియన్ డాలర్లుగా ఉంది. అంటే భారత కరెన్సీ ప్రకారం ఆయన ఏడాది సంపాదన రూ.450 కోట్లుగా ఉంది. ఆయన బేస్ పే 2.5 మిలియన్ డాలర్లు కాగా, స్టాక్ ఆప్షన్ల రూపంలో 42.3 మిలియన్ డాలర్లను సంపాదిస్తున్నారు.
ప్రపంచంలోని అతిపెద్ద, శక్తివంతమైన వ్యాపార సంస్థల్లో ఒకటిగా ఉన్న మైక్రోసాఫ్ట్ కంపెనీకి నాయకత్వం వహిస్తున్న భారతీయ వ్యక్తి సత్య నాదెళ్ల. ఆయన పూర్తి పేరు సత్య నారాయణ్ నాదెళ్ల. సత్య నాదెళ్ల 1967లో హైదరాబాదులో జన్మించారు. బిల్ గేట్స్, స్టీవ్ బాల్మెర్ తర్వాత సీఈవోగా మైక్రోసాఫ్ట్‌ను ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తిగా సత్య నాదెళ్ల నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన భారతీయ సంతతి వ్యక్తిగా నిలిచారు. 2014లో కంపెనీ సీఈవోగా బాధ్యతలు చేపట్టక ముందు ఆయన కంపెనీ క్లౌడ్, ఎంటర్‌ప్రైజ్ గ్రూప్‌కి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు.
సత్య నాదెళ్ల తల్లి సంస్కృత ఉపన్యాసకురాలు. ఆయన తండ్రి నాదెళ్ల యుగంధర్ 1962 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. సత్య నాదెళ్ల హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో చదువుకున్నారు. కర్ణాటక బెంగళూరులోని మణిపాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఆ తర్వాత విస్కాన్సిన్-మిల్వాకీ విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు. అలాగే చికాగో యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. 1992లో మైక్రోసాఫ్ట్‌లో చేరడానికి ముందు సత్య నాదెళ్ల కొంతకాలం సన్ మైక్రోసిస్టమ్స్‌లో పనిచేశారు. 2013లో సత్య పరిహారం 7.6 మిలియన్ డాలర్ల నుంచి 2016లో 84.5 మిలియన్ డాలర్లకు చేరుకుంది. ఆయన భార్య అనుపమ నాదెళ్ల తండ్రి సైతం ఐఏఎస్ అధికారి. ఆమె మణిపాల్‌లో సత్య నాదెళ్ల జూనియర్. అక్కడ ఆమె బిఆర్క్ పూర్తి చేశారు. సత్య నాదేళ్ల సగటు భారతీయుడి మాదిరిగానే క్రికెట్ లవర్, కవిత్వం చదవటం ఇష్టపడతారు.