
తెలంగాణ రాష్ట్రంపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి సారించింది.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం మెరుగ్గా ఉండడంతో.. నాయకులంతా కలిసికట్టుగా పని చేసి, ఏకతాటిపై ఉన్నట్లు పార్టీ శ్రేణులకు సంకేతాలను పంపేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవడంలో తెలంగాణ పీసీసీ నిమగ్నమైంది. ఇటీవల గజ్వేల్‌లో యువజన కాంగ్రెస్ నిర్వహించిన నిరుద్యోగ గర్జన, హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర మహిళా కాంగ్రెస్ సర్వసభ్య సమావేశం, అదేవిధంగా కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రతినిధులతో భేటీలతో కాంగ్రెస్ అధిష్టానం బిజీబిజీగా మారిపోయింది. తెలంగాణ రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజక వర్గాలకు నియమితులైన పరిశీలకులతో ప్రత్యేకంగా సమావేశమై దిశానిర్దేశం చేయనున్నారు. ఈ నెల 13వ తేదీన ఎస్టీ సెల్ సమావేశానికి జాతీయ ఆదివాసీ సెల్ ఛైర్మన్ శివాజీరావ్ మోగే హాజరుకానున్నారు. అదేవిధంగా ఈ నెల 18వ తేదీన నిర్వహించనున్న భారీ ర్యాలీ, బహిరంగ సభల్లో పాల్గొనేందుకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాష్ట్రానికి రానున్నారు. ఈ సభల ద్వారా పీసీసీ కసరత్తు చేస్తోంది. ఈ సభ ఎక్కడ ఏర్పాటు చేయాలన్నదానిపై పీసీసీ యోచిస్తోంది.
వ్యూహాత్మకంగా ముందుకెళ్లుతున్న ఏఐసీసీ.. పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులను, ఛైర్మన్లను రాష్ట్ర పర్యటనకు పంపి, ఆయా విభాగాలతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి దిశనిర్దేశం చేసేట్లు చూస్తోంది. ఇందువల్ల ఆయా వర్గాలు పార్టీ దగ్గర అవుతాయని, క్షేత్రస్థాయిలో ఆయా విభాగాలు కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ఓటర్లను ఆకట్టుకునేందుకు చురుకైన పాత్ర పోషిస్తాయని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రధానంగా ఎన్‌ఎస్‌యుఐ, యువజన, ఎస్సీ, ఎస్టీ, మహిళ విభాగాల ముఖ్య నేతలను రంగంలోకి దింపి వారికి లక్ష్యాలను నిర్దేశించనున్నారు. అంతేకాకుండా ఈనెలాఖరులో రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ సభలు ఉండే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కొల్లాపూర్‌లో ప్రియాంక గాంధీ సభ పెట్టాలనుకున్నప్పటికీ.. వాతావరణ ప్రతికూల పరిస్ధితులతో కుదరలేదు. దీంతో ఈ నెల చివరలో సభ ఏర్పాటు చేసి, ప్రియాంక గాంధీని తీసుకురావాలని తెలంగాణ కాంగ్రెస్ భావిస్తోంది. అదేవిధంగా త్వరలో రాహుల్‌గాంధీతో కూడా ఒక బహిరంగ సభ నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఎన్నికలు దగ్గర పడేప్పటికీ. చిట్టచివర ఒకట్రెండు సభలకు సోనియాగాంధీ కూడా పాల్గొనున్నారు.
కాంగ్రెస్ పార్టీ వస్తే రాష్ట్ర ప్రజలకు ఏమి చేస్తుందో సందేశం ఇప్పించాలని యోచిస్తున్నారు. సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తామని చెప్పిన.. మాటకు కట్టుబడి రాష్ట్రాన్ని ఇచ్చినందున.. ఇప్పుడు ఎన్నికల సందర్భంగా కూడా ఆమె ఏ విషయం చెప్పినా.. అది అమలు జరగడం ఖాయమన్న విశ్వాసాన్ని ప్రజల్లో నింపాలని పీసీసీ యోచిస్తోంది. ఇప్పటికే పార్లమెంటు నియోజక వర్గాలకు పరిశీలకులను నియమించిన ఏఐసీసీ వారి ద్వారా పార్టీలో నియోజకవర్గాల వారీగా నాయకులతో చర్చించి, సమన్వయం చేసుకునేట్లు చూస్తున్నారు. ఇటు పార్టీ అనుబంధ విభాగాలతోపాటు ఏఐసీసీ ప్రతినిధులు కూడా పెద్ద సంఖ్యలో పర్యటించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏఐసీసీ వేస్తున్న ఎత్తులు రాష్ట్ర కాంగ్రెస్‌కు ఏ మాత్రం ప్రయోజనం చేకూరుస్తాయో వేచి చూడాలి.