
మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్ రాష్ట్రాలకు ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాలను ప్రకటించింది. ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 21 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఇందులో కాంకేర్ నుంచి ఆశారామ్ నేతమ్, ప్రేమ్‌నగర్ నుంచి భూలాన్ సింగ్ మరావి, కోర్బా నుంచి లఖన్‌లాల్ దేవాంగన్ అభ్యర్థులుగా నిలిచారు. ఈ జాబితాలో ఐదుగురు మహిళలు అభ్యర్థులుగా ఉన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి ఎలాగైనా అక్కడ విజయం సాధించాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ఇక, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 90గా ఉంది.
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 39 మంది అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. మధ్యప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 230గా ఉంది. మధ్యప్రదేశ్‌లో ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో అక్కడ తిరిగి మరోసారి అధికారం దక్కించుకునే విధంగా బీజేపీ పావులు కదుపుతుంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో పార్టీ ఎన్నికల సన్నాహాలను బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమీక్షించిన ఒక రోజు తర్వాత ఈ ప్రకటన వెలువడింది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పార్టీ సీనియర్ నేతలు హాజరయ్యారు. కేంద్ర ఎన్నికల సంఘం.. ఈ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించకముందే బీజేపీ అభ్యర్థుల పేర్లను ప్రకటించడం గమనార్హం. అయితే అభ్యర్థుల పేర్లను ముందుగానే ప్రకటించడం ద్వారా పార్టీ శ్రేణుల్లో విభేదాలను గుర్తించి, సమస్యలను ముందుగానే పరిష్కరించే లక్ష్యంతోనే బీజేపీ అధిష్టానం ఈ చర్య చేపట్టినట్టుగా తెలుస్తోంది.