
దేశంలో రాబోయే 2024 లోక్‌సభ ఎన్నికల్లో యూపీలోని అమేధి నుంచి కాంగ్రెస్ నేత, వయనాద్ ఎంపీ రాహుల్ గాంధీ బరిలో దిగుతారని యూపీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ రాయ్ పేర్కొన్నారు. అమేధి నుంచి రాహుల్ తిరిగి పోటీ చేస్తే కేంద్ర మంత్రి, బీజేపీ నేత స్మృతి ఇరానీతో ఆయన నేరుగా తలపడతారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌పై స్మృతి ఇరానీ 55,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. గాంధీ కుటుంబానికి కంచుకోటగా పేరొందిన అమేధిలో రాహుల్ గాంధీని పోటీ చేయించేందుకు 2004లో ఈ సీటును సోనియా గాంధీ ఖాళీ చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ అమేధి, వయనాద్ లోక్‌సభ స్ధానాల నుంచి పోటీ చేయగా వయనాద్ నుంచి గెలుపొందారు.
ఇక ప్రియాంక గాంధీ వారణాసి నుంచి ప్రధాని నరేంద్ర మోదీపై పోటీ చేయాలని భావిస్తే పార్టీ కార్యకర్తలందరూ ఆమె విజయం కోసం శ్రమిస్తారని అజయ్ రాయ్ తెలిపారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ ప్రియాంక గాంధీ ప్రధాని వారణాసిలో మోదీతో తలపడతారని భావించినా చివరిక్షణంలో వారణాసి నుంచి అజయ్ రాయ్‌ను కాంగ్రెస్ పార్టీ బరిలో దింపింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లోనూ అజయ్ రాయ్ మోదీపై పోటీ చేసి ఓటమి చవిచూశారు.