ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్ పై ఆసుపత్రులు వైద్యం నిరాకరిస్తే ఇలా చేయండి

Share On

దేశంలో పేద ప్రజల చికిత్సకయ్యే ఖర్చును భరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ‘ఆయుష్మాన్ భారత్ యోజన’ పథకాన్ని ప్రవేశపెట్టింది. దేశంలోని పేద, నిమ్న వర్గాల ప్రజలకు మెరుగైన చికిత్స అందించాలన్న లక్ష్యంతో ఈ ఆరోగ్య పథకాన్ని ప్రవేశపెట్టింది. ఖరీదైన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు కొనలేని పేదవారు ఈ పథకంలో చేరి అనూహ్య ఖర్చుల నుంచి రక్షణ పొందవచ్చు. ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్ ఉన్న వారికి కవరేజీ ఎంత లభిస్తుంది? ఏయే ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకోవచ్చు? ఒకవేళ ఆసుపత్రులు వైద్యం నిరాకరిస్తే ఏం చేయాలనేది తెలుసుకుందాం.

*రూ.5 లక్షల కవరేజీ

ఆయుష్మాన్ భారత్ యోజన పథకం ప్రజలకు ఆర్థికపరమైన రక్షణను కల్పిస్తోంది. 2018 సెప్టెంబర్‌లో ఈ పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. దేశంలోని 50 కోట్ల మందికి పైగా ప్రజలను ఈ పథకం కిందకి తీసుకు రావాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి ‘ఆయుష్మాన్ భారత్ యోజన’ కింద రూ.5 లక్షల వరకు కవరేజీ లభిస్తోంది. మెడికల్ ఖర్చులు, డయాగ్నొస్టిక్ ఖర్చులు, హాస్పిటల్‌లో చేరే ముందు అయ్యే ఖర్చులను కూడా ఈ పథకం భరిస్తుంది. ఇ-కార్డ్‌తో క్యాష్‌లెస్ సేవలను కూడా ఆఫర్ చేస్తోంది.

  • ఎప్పుడు చేయాలి?

కేంద్రం తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ పథకంలో ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఎన్నో ఆసుపత్రులు చేరాయి. ఈ స్కీమ్ మార్గనిర్దేశాలకు అనుగుణంగా ఈ ఆసుపత్రులు నడుచుకోవాల్సి ఉంటుంది. పథకం కింద పేర్కొన్న వైద్య సేవలను తప్పనిసరిగా అందించాల్సి ఉంటుంది. అయితే, ఏ కారణం చేతనైనా వైద్యం నిరాకరిస్తే కార్డు హోల్డర్ సంబంధిత హాస్పిటల్‌పై ఫిర్యాదు చేయొచ్చు. ముందుగా, వైద్యం తిరస్కరించడానికి ఆసుపత్రి చూపుతున్న ప్రధాన కారణమేంటో తెలుసుకోవాలి. సదరు ఆసుపత్రిలో సంబంధిత చికిత్సకు సంబంధించిన అన్ని సౌకర్యాలు ఉండి నిరాకరిస్తే ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది.

  • ఆసుపత్రులు నిరాకరిస్తే ఇలా ఫిర్యాదు చేయండి

ఆసుపత్రులపై ఫిర్యాదు చేయడానికి లబ్ధి దారులు టోల్ ఫ్రీ నంబర్‌కి కాల్ చేయొచ్చు. ఆయుష్మాన్ భారత్ యోజన పథకానికి చెందిన నేషనల్ టోల్ ఫ్రీ నంబర్ 14555కి కాల్ చేసి ఫిర్యాదు ఇవ్వవచ్చు. వివిధ రాష్ట్రాలకు కూడా ఈ టోల్ ఫ్రీ నంబర్లు ప్రత్యేకంగా కేటాయించారు. ఇందులో యూపీ, మధ్యప్రదేశ్ , ఉత్తరాఖండ్ , బిహార్ వంటి రాష్ట్రాలు ఉన్నాయి. ఉత్తర్ ప్రదేశ్ వాసుల కోసం 180018004444 నంబర్ అందుబాటులో ఉంటుంది. ఇక, 18002332085 నంబర్‌కి కాల్ చేసి మధ్యప్రదేశ్ వాసులు ఫిర్యాదు చేయొచ్చు. బిహార్ వాసులు 104 కాల్ చేస్తే సరిపోతుంది. ఉత్తరాఖండ్ ప్రజలకు రెండు టోల్ ఫ్రీ నంబర్లు 155368, 18001805368 అందుబాటులో ఉన్నాయి. ఆయుష్మాన్ భారత్ యోజన పథకం విషయంలో ఆసుపత్రులపై అన్ని సందర్భాల్లోనూ ఫిర్యాదు చేయడానికి వీలులేదు. వైద్యం అందించడానికి సదరు ఆసుపత్రిలో తగిన సౌకర్యాలు లేకపోతే కార్డ్ హోల్డర్ హాస్పిటల్‌పై ఫిర్యాదు చేయలేరు. ఈ కారణంతో ఆసుపత్రులు వైద్యం నిరాకరిస్తే ఫిర్యాదు చేయలేమన్న విషయాన్ని లబ్ధి దారులు తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఒకవేళ అన్ని సదుపాయాలు ఉండి కూడా వైద్యం చేయని ఆసుపత్రులపై ఫిర్యాదు చేస్తే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

English English Hindi Hindi Telugu Telugu