
మనిషి ఎంత పని చేసిన, ఎంత కష్టపడినా సమయానికి తినాలి.. బిజీ బిజీ అంటూ సమయానికి తినకుంటే మాత్రం సంపాదించినా డబ్బులు అంతా మళ్లీ ఆరోగ్యం కాపాడుకోవడానికి ఖర్చు పెట్టాల్సిందే. సమయానికి ఆహారం తినకపోతే క్రమంగా మీ ఆరోగ్యాన్ని మీరే నాశనం చేసుకున్నట్టు. ముఖ్యంగా మధ్యాహ్న భోజనం ఆలస్యంగా తినడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు అన్నీ ఇన్నీ కాదు. రోజుకు మూడు పూటలా ఖచ్చితంగా తినాలి. రోజుకు కొద్ది మొత్తంలో నాలుగైదు సార్లైనా తినొచ్చు. కానీ ప్రతి సారి మీరు టైంకే తినాలి. అయితే చాలా మంది అల్పాహారం మాత్రమే టైంకే తింటారు. కానీ మిగతా సమయాల్లో మాత్రం ఆహారానికి అంతగా ప్రాధాన్యం ఇవ్వరు. ముఖ్యంగా ఎప్పుడో వేళకాని వేళలో లేదా ఆలస్యంగా తింటుంటారు. అయితే లంచ్, డిన్నర్ మధ్య తీసుకునే స్నాక్స్ ఆరోగ్యాన్ని సానుకూలంగా లేదా ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి.. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో. మధ్యాహ్నం ఆలస్యంగా తినడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
మధ్యాహ్నం ఆలస్యంగా తినడం వల్ల కడుపులో గ్యాస్ ఏర్పడే ప్రమాదం ఉంది. కొంతమందికి భోజనం చేసిన వెంటనే గ్యాస్ సమస్య తగ్గిపోతుంది. కానీ చాలా మందికి మాత్రం తిన్నా కూడా గ్యాస్ సమస్య మరింత ఎక్కువవుతుంది. లేదా అసౌకర్యంగా అనిపిస్తుంది. అందుకే మధ్యాహ్నం ఆలస్యంగా తినకూడదని నిపుణులు అంటున్నారు. మధ్యాహ్న భోజనం ఆలస్యమైతే రకరకాల అసౌకర్యాలకు గురవుతారు. అలసట, నిద్రమబ్బు, శక్తి లేకపోవడం, యాంగ్జైటీ, కోపం, అసహనం వంటి అనేక ఎన్నో సమస్యలు మధ్యాహ్నం భోజనం సమయానికి చేయకపోవడం వల్లే వస్తాయని చెపుతున్నారు. ఆలస్యంగా తిన్న తర్వాత నిద్రమత్తులోకి జారుకుని ఆ తర్వాత ఏం చేయాలనిపించదు.
క్రమం తప్పకుండా మధ్యాహ్నం పూట ఆలస్యంగా తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అయితే ఆలస్యమైనా భోజనం చేసే వరకు అప్పుడప్పుడు కనీసం మంచి నీళ్లు ఐనా తాగుతూ ఉండాలి. చల్లటి నీరు లేదా తీపి పానీయాలను అసలే తాగకూడదు. ఈ సమయంలో సాదా నీటిని మాత్రమే తాగాలి. అలాగే భోజనం ఆలస్యం అవుతుందని తెలిస్తే అడపాదడపా కొన్ని ఆరోగ్యకరమైన స్నాక్స్ ను తినడం మంచిది. అరటిపండ్లు, చిక్కుళ్లు, బొప్పాయి, సీతాఫలాలు, జామ వంటి పండ్లను ఈ సమయంలో మీరు తినొచ్చు. ఇవి మీ శరీరానికి పోషకాలను అందిస్తాయి. మిమ్మల్ని శక్తివంతంగా ఉంచుతాయి. మధ్యాహ్న భోజనం ఆలస్యంగా చేయడం వల్ల తలనొప్పి వంటి సమస్యలు కూడా రావొచ్చు. ఇలా సమస్య వస్తే తిన్న తర్వాత కొద్దిగా నెయ్యి, బెల్లాన్ని తీసుకోండి. ఇది ఎసిడిటీ, గ్యాస్ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మనిషి ఎంత బిజీగా ఉన్న, ఎంత సంపాదిస్తున్న సమయానికి ఆహారం తీసుకోవాలి లేదంటే మనిషి తన ఆరోగ్యాన్ని తనే నాశనం చేసుకున్నవారు అవుతారు.