
దేశ రాజధాని ఢిల్లీలో జీ-20 శిఖరాగ్ర సదస్సులో అతిసామాన్యమైన ఇద్దరు మహిళా రైతులకు ఆహ్వానం అందించారు. గిట్టుబాటు లేక వ్యవసాయాన్నే వదిలేస్తున్న ఈ రోజుల్లో.. తమ స్వంత ఆలోచనతో సాగుబాట పట్టి అందులో అద్భుతాలు సాధిస్తున్నారు. వీరు సాధించిన విజయాలను జీ-20 సదస్సు వేదికగా ప్రపంచ నేతలకు ఒడిశాకు చెందిన 36 ఏళ్ల రాయిమతి ఘివురియా, 45 ఏళ్ల సుబాశ మొహంత చెప్పనున్నారు.
సొంత భూమిలోనే ఫామ్ స్కూల్ ప్రారంభం
రాయిమతి ఘివురియా, ఒడిశా
ఒడిశాలోని కొరాపుట్ జిల్లా కుంద్ర సమితికి చెందిన రాయిమతి ఘివురియా ముగ్గురు పిల్లల తల్లి. ఆదివాసీ తెగకు చెందిన ఈమె సాగుపై ఆసక్తితో పంటలు పండించడం మొదలుపెట్టారు. కుటుంబసభ్యుల సహకారంతో సేంద్రియ వ్యవసాయం ప్రారంభించారు. తొలుత వరి సాగు చేసిన ఆమె.. ఆ తర్వాత తృణధాన్యాలపై దృష్టిసారించారు. అలా ఇప్పటివరకు 72 స్వదేశీ వరి వంగడాలు, 30 రకాల తృణధాన్యాలను సాగు చేస్తున్నారు. సేంద్రియ వ్యవసాయం ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ దాదాపు 2500 రైతులను ఇందులోకి తీసుకొచ్చారు.
సాంప్రదాయ పద్ధతుల్లో తృణధాన్యాల సాగు, ఇతర అంశాలపై రైతులకు శిక్షణ ఇచ్చేందుకు 2012లో తన సొంత భూమిలోనే ఒక ఫామ్ స్కూల్‌ను కూడా ప్రారంభించారు. స్థానిక ఆదివాసీ రైతుల నుంచి తృణధాన్యాలు సేకరించి, వాటిని కనీస ధరకు విక్రయించడం కోసం సొంతంగా ఒక కంపెనీని కూడా ప్రారంభించారు. ఆమె ఆవిష్కరణలకు గుర్తింపుగా ఇప్పటికే పలు అవార్డులు వరించాయి. తాజాగా సెప్టెంబరు 9వ తేదీన దిల్లీలో జరిగే జీ-20 సదస్సుకు హాజరయ్యేందుకు ఆహ్వానం లభించింది. దీనిపై రాయిమతి సంతోషం వ్యక్తం చేశారు. ఈ వేదికలో పాల్గొనే అవకాశం రావడం అదృష్టం. తృణధాన్యాల సాగుతో నాలాంటి ఎంతో మంది ఆదివాసీల మహిళల జీవితాలు ఎలా మారిపోయాయే నేను వివరిస్తాను. సంప్రదాయ పద్ధతుల్లో పండించిన తృణధాన్యాలను కూడా ప్రదర్శిస్తానని ఆమె ఆనందం వ్యక్తం చేశారు.
మిల్లెట్స్, రాగుల పంటలో అద్భుతాలు
సుబాశ మొహంత, ఒడిశా
మయూర్‌భంజ్ జిల్లా సింగార్‌పుర్ గ్రామానికి చెందిన సుబాశ మొహంత ఆదివాసీ తెగకు చెందిన నిరుపేద మహిళ.. ఒకప్పుడు వరి సాగు చేసేవారు. ప్రకృతి వైపరీత్యాలు, ఇతరత్రా కారణాలతో కొన్నేళ్ల పాటు పంట నష్టాన్ని చవిచూశారు. ఇక వ్యవసాయాన్ని వదిలేద్దామనుకున్న సమయంలో ఒడిశా ప్రభుత్వం మిల్లెట్స్ మిషన్ తీసుకొచ్చింది. వారిచ్చిన ప్రోత్సాహంతో తొలుత ఎకరం భూమిలో సేంద్రియ పద్ధతుల్లో రాగుల పంట వేశారు. మంచి దిగుబడి రావడంతో ఇక వెనుదిరిగి చూడలేదు. ప్రస్తుతం 8 ఎకరాల్లో రాగుల సాగు చేస్తున్న మొహంత.. తృణధాన్యాల సాగుపై స్థానికులను ప్రోత్సహిస్తున్నారు.
ఈ ఏడాది మార్చిలో తృణధాన్యాలపై జరిగిన ప్రపంచ సదస్సులో మొహంత కూడా పాల్గొన్నారు. ఆ సందర్భంగా ప్రధాని మోదీతో ఆమె కొంతసేపు మాట్లాడే అవకాశం వచ్చింది. తాజాగా జీ-20 సదస్సులో పాల్గొనేందుకు ఆహ్వానం రావడంతో ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్యసమితి ఈ ఏడాదిని అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరంగా గుర్తించింది. ఈ క్రమంలోనే జీ-20 సదస్సులోనూ మిల్లెట్స్‌కు ప్రాధాన్యం కల్పించారు. సదస్సుల్లో పాల్గొనేందుకు వచ్చే విదేశీ అతిథులకు తృణధాన్యాలతో విందును, మిల్లెట్స్ ప్రదర్శనను కూడా ఏర్పాటు చేశారు.