
చాలా మంది దొంగలు సాధారణంగా ఎవరూ చూడని సమయంలో, ఎవరూ లేని వాహనాలు ఎత్తుకెళుతుంటారు. కానీ ఈ దొంగ మాత్రం ఏకంగా ప్రయాణికులతో కూడిన ఆర్టీసీ బస్సునే ఎత్తుకెళ్లాడు. బస్టాండ్‌లో నిలిపివున్న బస్సును ప్రయాణికులు ఉండగానే.. స్టార్ట్ చేసుకుని వెళ్లిపోయాడు. ఈ ఘటన సిద్దిపేటలో చోటు చేసుకుంది. ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట బస్టాండ్‌లో సోమవారం నిలిపివున్న ఆర్టీసీ బస్సును నిందితుడు ప్రయాణికులు అందులో ఉండగానే ఎత్తుకెళ్లాడు. అయితే, బస్సును జిల్లెళ్ల క్రాసింగ్ వద్దకు రాగానే రోడ్డుపై నుంచి గుంతలోకి తీసుకెళ్లాడు. దీంతో ఆందోళన చెందిన ప్రయాణికులు నువ్వు అసలు ఆర్టీసీ డ్రైవర్‌వేనా? ప్రశ్నించారు.
ఈ క్రమంలో ప్రయాణికులు అతడు ఆర్టీసీ డ్రైవర్ కాదని.. బస్సును ఎత్తుకొచ్చాడని తెలిసిపోయింది. వెంటనే బస్సును ఆపించి.. అందులోంచి దిగారు. అతనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బస్సు ఆగిన ప్రదేశానికి పోలీసులు చేరుకున్నారు. అప్పటికే బస్సును ఎత్తుకెళ్లిన దొంగ అక్కడి నుంచి జారుకున్నాడు. బస్సు ఎత్తుకెళ్లిన ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, బస్సు నిలిపివేసిన అనంతరం కొందరు ప్రయాణికులు ఆ బస్సు దొంగను వీడియో తీశారు. వాటి ఆధారంగా నిందితుదీని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చేపట్టారు. బస్సు బస్టాండ్‌లో కనిపించకపోవడంత ఆ బస్సు డ్రైవర్, కండక్టర్ ఆందోళన వ్యక్తం చేశారు. చివరకు ఇలా జరిగిందని తెలిసి కొంత ఊరట చెందారు. దొంగ ఎత్తుకెళ్లిన బస్సుకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.