
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులపై పవన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. బీజేపీతో సంబంధం లేకుండా టీడీపీతో కలిసి పోటీ చేస్తామని ప్రకటించారు. ఇన్నాళ్లూ టీడీపీ,జనసేన కలిసి ఉన్నాయా లేదా అని తాను ఇన్నాళ్లూ ఆలోచిస్తున్నా అన్నారు. కానీ ఇప్పుడు తాను ఎన్డీయేలో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయాలన్నది తన కోరిక అన్నారు. బీజేపీ దీనిపై ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియదన్నారు. అరాచకాన్ని అడ్డుకోవాలంటే విడివిడిగా పోటీ చేస్తే పనిచేయదని, సమిష్టిగానే ఎదుర్కోవాలన్నారు. వైసీపీ దుష్టపాలనను ఏపీ ప్రజలు తీసుకోలేరన్నారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును ఇవాళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు బాలకృష్ణ, నారా లోకేష్ కలిశారు. దాదాపు 40 నిమిషాల భేటీ తర్వాత బయటికి వచ్చిన పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేసారు.
తనలాంటి వ్యక్తిని తెలంగాణ సరిహద్దుల్లో 200 మంది పోలీసుల్ని పెట్టి ఆపారంటే సామాన్యుడి పరిస్ధితి ఏంటన్నారు. తనను కూడా రానివ్వడం లేదని, మొన్నటి దాకా తానే నిర్ణయం తీసుకోలేదని, కానీ ఇప్పుడు జనసేన-టీడీపీ కలిసి వెళ్తాయని ప్రకటించారు. ఇది తమ ఇద్దరి భవిష్యత్తుకు సంబంధించిది కాదని, ఏపీ భవిష్యత్తుకు సంబంధించిన అంశమన్నారు. ఏపీలో అన్ని వ్యవస్ధల్ని దోచుకున్న వ్యక్తుల్ని ఎలా ఎదుర్కోవాలో తమకు తెలుసని పవన్ తెలిపారు. జగన్ నీకు ఆరునెలలు మాత్రమే ఉన్నాయని, ఈ ఆరునెలల్లోనే ఏం చేసినా అనేది జగన్ మద్దతుదారులు గుర్తుంచుకోవాలని పవన్ సూచించారు. మీకు యుద్దమే కావాలంటే యుద్దమే ఇస్తామన్నారు. జగన్ కు మద్దతివ్వాలా లేదా అనేది వైసీపీ మద్దతుదారులు గుర్తుంచుకోవాలన్నారు. తాము అధికారంలోకి వస్తే ఎవరినీ వదిలిపెట్టబోమన్నారు. ఓ మాజీ సీఎంని మీరు రిమాండ్ లో కూర్చోబెట్టినప్పుడు మీ పరిస్దితి ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయన్నారు. బీజేపీ కూడా దీనికి కలిసి వస్తుందన్నారు.
చంద్రబాబుతో భేటీలో ఆయనకు ఇలాంటి దుస్ధితి రావడం బాధాకరమని చెప్పానన్నారు. ఆయన ఆరోగ్యంపై ఆరా తీశానన్నారు. తనకు ఎలాగో భద్రత లేదని, జైల్లోనూ చంద్రబాబుకు భద్రత లేదన్నారు. దీనిపై అమిత్ షా, ప్రధాని దృష్టికి తీసుకెళ్తానన్నారు. రేపటి నుంచి జనసేన-టీడీపీ ఉమ్మడి కార్యాచరణ ఎలా ఉంటుందో నిర్ణయిస్తామన్నారు. ఏపీ దుస్ధితిని ఇరు పార్టీల నాయకులకు వివరించి వారిని ఎన్నికలకు సంసిద్ధం చేస్తామన్నారు. జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసి పనిచేస్తామన్నారు. అలాగే ప్రధాని, గవర్నర్, అమిత్ షాలను కలిసి పరిస్దితి వివరిస్తామన్నారు. ఆ తర్వాత ఎలా పోటీ చేయాలన్న దానిపై ఆలోచిస్తామన్నారు. ప్రస్తుతం ప్రజలకు భరోసా కల్పించడమే తమ లక్ష్యమన్నారు.