
భారతదేశం నుండి చాలా మంది ఉపాధి కోసం ఇతర దేశాలకు వెళ్తుంటారు. అలాంటిది సింగపూర్ వెళ్లిన ఇద్దరు భారతీయులు అక్కడ గొడవ పడ్డారు. ఆ గొడవలో ఒక వ్యక్తి మరో వ్యక్తి వేలు కొరికాడు. ఈ కేసును విచారించిన ఓ సింగపూర్ కోర్టు వేలు కొరికిన నిందితుడిని దోషిగా ప్రకటిస్తూ 10 నెలల జైలు శిక్ష విధించింది. భారత్‌కు తంగరాసు రంగస్వామి, నాగూరన్ బాలసుబ్రమణ్యన్ జీవనోపాధి నిమిత్తం సింగపూర్ వెళ్లారు. అక్కడే వేర్వేరు వసతి గృహాల్లో ఉంటూ రంగస్వామి ప్రొక్లెయిన్ ఆపరేటర్‌గా, బాలసుబ్రమణ్యన్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నారు.
ఈ ఏడాది ఏప్రిల్ 22న బాలసుబ్రమణ్యన్, మరో భవన నిర్మాణ కార్మికుడు రామమూర్తి అనంతరాజ్ ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న రంగస్వామి వీరిపై అరవటం మొదలుపెట్టాడు. దాంతో నిశ్శబ్దంగా ఉండాలని రామమూర్తి చెప్పాడు. గొడవ పెద్దది కావడంతో బాలసుబ్రమణ్యన్ ఇరువురికి సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో బాలసుబ్రమణ్యన్ ఎడమ చేతి చూపుడు వేలు రంగస్వామి నోట్లోకి వెళ్లింది. అప్పటికే కోపంతో రగిలిపోతున్న రంగస్వామి ఆ వేలును గట్టిగా కొరికి.. వదలకుండా అలాగే పట్టుకున్నాడు. ఈ క్రమంలో ఇరువురూ కిందపడిపోయారు. రామమూర్తి విడిపించే ప్రయత్నం చేసినా రంగస్వామి వెనక్కి తగ్గలేదు. ఈ పెనుగులాటలో చివరికి బాల సుబ్రమణ్యన్ వేలు తెగిపోయింది. తీవ్ర రక్తస్రావం కావడంతో అతడు ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వచ్చి బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. తెగిన వేలు భాగం కనిపించకపోవడంతో వైద్యులు అలాగే వేలుకు శస్త్రచికిత్స చేశారు. ఆ తరువాత న్యాయం కోసం బాధితుడు కోర్టును ఆశ్రయించాడు. బాల సుబ్రమణ్యన్ తరఫున డిప్యూటీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కై చెంగన్ కోర్టులో వాదించారు. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ టెక్నీషియన్ అయిన తన క్లయింట్‌కు వేలు కోల్పోయి వృత్తి పరంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ఆయన న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. నిందితుడికి 10 నెలలు లేదా ఏడాది జైలు శిక్ష విధించాలని కోరారు. ఈ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం నిందితుడు రంగస్వామికి 10 నెలల జైలు శిక్ష విధిస్తున్నట్లుగా తీర్పు వెలువరించింది.