
పోలీస్ వాహనం ఢీకొనడంతో అమెరికాలో మరణించిన తెలుగు విద్యార్థిని కందుల జాహ్నవికి మరణాంతరం డిగ్రీ ప్రదానం చేయనున్నట్లు ఆమె చదువుతున్న యూనివర్సిటీ తెలిపింది. మాస్టర్స్ డిగ్రీ పట్టాను జాహ్నవి కుటుంబానికి అందజేస్తామని పేర్కొంది. ఆమె అకాల మరణంపట్ల నార్త్‌ఈస్టర్న్ యూనివర్సిటీ ఛాన్సలర్ సంతాపం తెలిపారు. ఈ దుర్ఘటన వల్ల భారతీయ విద్యార్థులపై పడే ప్రభావాన్ని తాము అర్థం చేసుకోగలమని అన్నారు. జాహ్నవి కుటుంబానికి మద్దతుగా ఉంటామని, కేసు దర్యాప్తులో న్యాయం జరిగేలా సహకరిస్తామని చెప్పారు. విద్యార్థుల సహాయం కోసం ఒక హెల్ప్‌లైన్ నంబర్ కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఆ యూనివర్సిటీ జారీ చేసిన ప్రకటనలో ఈ మేరకు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలుకు చెందిన 23 ఏండ్ల కందుల జాహ్నవి అమెరికా సౌత్ లేక్ యూనియన్‌లోని నార్త్‌ఈస్టర్న్ యూనివర్సిటీ సీటల్ క్యాంపస్‌లో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నది. ఈ ఏడాది జనవరిలో రోడ్డు దాటుతుండగా వేగంగా వెళ్తున్న పోలీస్ వాహనం ఢీకొట్టింది. గాల్లో ఎగిరి రోడ్డుపై పడిన ఆమె ఈ ప్రమాదంలో చనిపోయింది.