బిఆర్ఎస్ అభ్యర్థుల్లో ఆందోళనలు

Share On

తెలంగాణ అసెంబ్లీలో బిఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ వచ్చిన రాని వారి కంటే, టికెట్ వచ్చిన వారే ఎక్కువగా టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే టికెట్ రాలేదని కోపంతో ఉన్న అసమ్మతి నేతల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. కొంతమందిని బుజ్జగిస్తూ దారిలో తెచ్చుకుంటే, మరి కొంతమంది మాత్రం మాట వినడం లేదని తెలుస్తుంది. రాష్ట్రంలో అన్ని పార్టీల కంటే ముందుగానే 115 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించి అధికార బీఆర్ఎస్ పార్టీ ముందుకు సాగుతుంది. కొన్ని చోట్ల టికెట్లు దక్కని అభ్యర్థుల నుంచి అసమ్మతి ఎదురవుతున్నా బుజ్జగిస్తూ బీఆర్ఎస్ నేతలు దూసుకు పోతున్నారు. టికెట్లు ఆశించి భంగపడ్డ నేతల్లో నిరాశ ఉండటం సహజమే. కానీ టికెట్ దక్కిన ఎమ్మెల్యేల్లోనూ ఇప్పుడు టెన్షన్ కనిపిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. టికెట్ దక్కిందనే ఉత్సాహంతో ఎన్నికల కోసం ఏర్పాట్లు చేసుకోవాల్సింది పోయి కొంతమంది ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. అసమ్మతి నేతలతో ఒక సమస్య అయితే ఎన్నికల సమయం నాటికి తమ టికెట్ ఉంటుందో ఊడుతుందో అనేదే వీళ్ల భయానికి కారణమని అంటున్నారు.

బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగానే 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధిక సంఖ్యలో సిట్టింగ్ లకు మళ్లీ అవకాశం ఇచ్చారు. దీంతో టికెట్ దక్కిందని భరోసాతో వీళ్లు ఇతర పార్టీల వైపు చూడరన్నది ఇక్కడ కేసీఆర్ ఆలోచనగా కనిపిస్తోంది. కానీ వీళ్లలో చాలా మందిపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఈ విషయం కూడా అధినేత కేసీఆర్ కు తెలుసు. కానీ ఇప్పుడు టికెట్ ఇవ్వకుండా పక్కనపెడితే.. ప్రత్యర్థి పార్టీల్లోకి జంప్ అయి బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకపోలేదు. ఈ విషయాన్ని అంచనా వేసే కేసీఆర్ సిట్టింగ్ అభ్యర్థులకు మరోసారి ప్రాధాన్యత ఇచ్చారని చెబుతున్నారు.

కానీ ఎన్నికల సమయం నాటికి ముందుగా ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో కచ్చితంగా మార్పులుంటాయనేది బీఆర్ఎస్ వర్గాలనుంచి ప్రచారం జరుగుతుంది. మరోవైపు ప్రత్యర్థి పార్టీలు కూడా ఇదే అంటున్నాయి. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడింట్, మంత్రి కేటీఆర్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. అభ్యర్థుల జాబితాలో ఒకటో రెండో మార్పులు ఉంటాయని చెప్పారు. కానీ 30 కంటే ఎక్కువ స్థానాల్లోనే అభ్యర్థులను మార్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఇప్పుడిదే కొంతమంది టికెట్లు లభించిన ఎమ్మెల్యేల్లో టెన్షన్ కు ప్రధాన కారణమవుతోంది. చివరి వరకు ఏం జరుగుతుందో తెలియక ఆందోళన చెందుతున్నారు. ముందే పార్టీ మారితే నష్టం జరుగుతుందేమోనని ఆలోచిస్తున్నారు. కానీ చివరి వరకూ వేచి చూస్తే ఇతర పార్టీలు అభ్యర్థులను ప్రకటించేస్తాయి. దీంతో ఏం చేయాలో టికెట్ లభించిన అభ్యర్థులు ఆందోళనలకు గురవుతున్నారని సమాచారం..


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

English English Hindi Hindi Telugu Telugu