
గుండెపోటు ఎవరికీ, ఎప్పుడు ఎలా వస్తుందో తెలియడం లేదు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఈ మధ్య కాలంలో జిమ్‌లో వ్యాయమం చేస్తూ గుండెపోటుతో మరణించే ఘటనలు బాగా పెరిగిపోయాయి. తాజాగా అలాంటిదే మరో ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ సిటీలో జరిగింది. ఒక జిమ్‌లో 19 ఏళ్ల యువకుడు వ్యాయామం చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ట్రెడ్‌మిల్‌పై నడుస్తుండగా కార్డియాక్ అరెస్ట్ కావడంతో అతను అమాంతం చెట్టులా కూలిపోయాడు. ఈ దృశ్యాలు జిమ్‌లో ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. యువకుడు కుప్పకూలిన తర్వాత కొన్ని క్షణాలకు జిమ్‌లో ఉన్న మరో ఇద్దరు వ్యక్తులు అతని దగ్గరికి వచ్చి సాయపడుతున్నట్లు సీసీ ఫుటేజ్‌లో కనిపిస్తున్నది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడు బీహార్ రాష్ట్రానికి చెందిన సిద్దార్థ్ కుమార్ సింగ్‌గా గుర్తించారు. సింగ్ మరణంతో కుటుంబసభ్యులు అతడి మృతదేహాన్ని బీహార్‌కు తీసుకెళ్లారు. మితిమీరిన వ్యాయామం, మానసిక ఒత్తిళ్ల కారణంగానే జిమ్‌లో పనిచేస్తున్నప్పుడు గుండెపోటు, కార్డియాక్ అరెస్టుతో మరణిస్తున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు.