ఒడిశాలో పెరుగుతున్న స్క్రబ్‌ టైఫస్‌ కేసులు

Share On

ఒడిశా రాష్ట్రంలో స్క్రబ్‌ టైఫస్‌ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా సుందర్‌గఢ్‌ జిల్లాలో 11 పాజిటివ్‌ కేసులు నమోదవగా దాంతో వెలుగుచూశాయి. దాంతో కేసుల సంఖ్య 180కి చేరిందని ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. వ్యాధి లక్షణాలతో బాధపడుతున్న 59 మంది శాంపిళ్లను పరీక్షించగా అందులో 11 మందికి వ్యాధి నిర్ధారణ అయిందని వెల్లడించారు. మొత్తం 180 కేసుల్లో 10 మంది బాధితులు ఒడిశా రాష్ట్రేతరులు కాగా.. 9 మంది ఇతర జిల్లాల నుంచి ఉన్నారని సుందర్‌గఢ్‌ జిల్లా చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ కన్హు చరణ్‌ నాయక్‌ తెలిపారు. ఈ జిల్లాలో శనివారం ఏడు కేసులు నమోదయ్యాయి.

ఎవరికైనా నాలుగు లేదా ఐదు రోజులు జ్వరం ఉంటే వారు వెంటనే పరీక్షలు చేయించుకోవాలని కన్హు చరణ్‌ నాయక్‌ కోరారు. రూర్కెలా ప్రభుత్వ ఆస్పత్రి, సుందర్‌గఢ్‌ జిల్లా ఆరోగ్య కేంద్రంలో ఉచితంగానే పరీక్షలు నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. వ్యాధి ప్రబలుతున్న నేపథ్యంలో తగినంత మంది ఆశ కార్యకర్తలు, నర్సులకు శిక్షణ ఇచ్చి వారిని సన్నద్ధం చేశారు. ఒడిశాలో ఇప్పటి వరకు స్క్రబ్ టైఫస్‌ వ్యాధి బారినపడి ఏడుగురు చనిపోయారు. దాంతో అప్రమత్తమైన వైద్యారోగ్యశాఖ వ్యాధిని అధ్యయనం చేయడానికి వీర్‌ సురేంద్ర సాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ రీసెర్చ్‌ (వీఐఎంఎస్‌ఏఆర్‌) నుంచి ముగ్గురు నిపుణులను బర్గఢ్‌ జిల్లాకు పంపించింది. ప్రస్తుతం బర్గఢ్‌ జిల్లాలో 11 యాక్టివ్‌ కేసులున్నాయి. స్క్రబ్‌ టైఫస్ వ్యాధి తరచూ పొలాలు, అటవీ ప్రాంతాల్లో పనిచేసే ప్రజలకు సోకుతుంది. ఒక రకమైన లార్వా పురుగులు కుట్టడంతో శరీరంపై ‘ఎస్చర్‌’ అనే మచ్చ పడుతుంది. ఈ కీటకాలు కుట్టిన చోట చర్మకణాలు మృతి చెందుతాయి. వెంటనే చికిత్స చేయించుకోకపోతే ప్రాణాలకు అపాయం ఏర్పడుతుంది.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

English English Hindi Hindi Telugu Telugu