
హమాస్ ఉగ్రవాదులు, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న దాడుల్లో పలు కీలక విషయాలు బయటపడుతున్నాయి. హమాస్ దాడిలో మరణించిన వారి మృతదేహాలను గుర్తించే ప్రక్రియ ఇంకా పూర్తికాలేదని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వెల్లడించింది. హమాస్ దాడిలో 1300 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ అన్ని మృతదేహాల ఖననం పూర్తికాలేదు. హమాస్ దాడిలో మృతదేహాలు దారుణంగా దెబ్బతిన్నాయి. అందుకే 13 రోజులు గడిచినప్పటికీ వాటి ఖననంలో జాప్యం జరుగుతోంది’ అని ఐడీఎఫ్ గురువారం ట్వీట్ చేసింది.
ఈ నెల 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేయడంతో మొదలైన పోరు ఇప్పటికీ కొనసాగుతోంది. ఇజ్రాయెల్ దాడులతో గాజా ప్రాంతం ధ్వంసమవుతోంది. దాంతో అక్కడి సామాన్య ప్రజలకు మానవతా సాయం అందించేందుకు అమెరికా ముందుకు వచ్చింది. అలాగే ఈజిప్టు రఫా వద్ద సరిహద్దులు తెరిచేందుకు అంగీకరించడంతో అంతర్జాతీయ సంస్థలు గాజాకు సాయం చేయడానికి మార్గం లభించినట్లయింది.
మధ్యప్రాచ్యంలో మరింత స్థిరత్వం తీసుకువచ్చేందుకు ఈజిప్టుతో కలిసి పనిచేయాలనుకుంటున్నట్లు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వెల్లడించారు. ఇదే విషయాన్ని ఈజిప్టు అధ్యక్షుడికి వెల్లడించినట్లు చెప్పారు. ఈ మేరకు చైనా ప్రభుత్వ రంగ మీడియా సంస్థ పేర్కొంది. మరోపక్క అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇప్పటికే ఇజ్రాయెల్‌లో పర్యటించగా.. గురువారం బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ రానున్నారు.