
శనివారం పాక్షిక చంద్రగ్రహణం కారణంగా నేడు తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు. సుమారు 8 గంటల పాటు ఆలయ తలుపులు మూసి ఉంచనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది.
ఈ నెల 29న తెల్లవారుజామున 1.05 గంటల నుంచి 2.22 గంటల మధ్య పాక్షిక చంద్రగ్రహణం ఉండగా.. గ్రహణ సమయానికి 6 గంటల ముందు తలుపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో 28న రాత్రి 7.05 గంటలకు ఆలయ తలుపులు మూసివేయనున్నారు. తెల్లవారుజామున 3.15 గంటలకు ఏకాంతంగా శుద్ధి, సుప్రభాతసేవ నిర్వహించి ఆలయ తలుపులు తెరుస్తారు. గ్రహణం కారణంగా 28న సహస్ర దీపాలంకార సేవ, వికలాంగులు, వృద్ధులకు కల్పించే స్వామివారి దర్శన సదుపాయాలను రద్దు చేసినట్లు టీటీడీ తెలిపింది.