
తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీలో రోడ్ల పరిస్ధితిపై ఇల్లందు సభలో తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన విమర్శలపై వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి గురువారం కౌంటర్ ఇచ్చారు. పక్క రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి అక్కడ ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడి రోడ్ల గురించి మాట్లాడం విచిత్రంగా ఉందన్నారు. అక్కడ రోడ్లు ఎలా ఉన్నాయో అక్కడ ఉన్న తెలంగాణ ప్రజలకి తెలుసని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కలిపిన పోలవరం ముంపు గ్రామాల్లో ఉన్న ఏడు గ్రామాల ప్రజలు ఏపీలోకి వస్తాం అంటున్నారని సజ్జల గుర్తుచేశారు. ఆ గ్రామల్లో ప్రజలు ఎందుకు వస్తున్నారో కేసీఆర్ ముందు తెలుసుకోవాలన్నారు. ఏపీలో అభివృద్ధి చూసి ఏపీలోకి వస్తున్నామని 7గ్రామాల ప్రజలు చెబుతున్నారన్నారు. ఏపీలో అభివృద్ధి చూసి దేశం మొత్తం గర్విస్తుంది.. కానీ కేసీఆర్ కు కనిపించడం లేదన్నారు.
గతంలో ఏపీలో పింఛన్లు ఎలా అమలు చేస్తున్నారో తెలుసుకొని తెలంగాణలో కూడా అదే విధంగా అమలు చేయాలని కేసీఆర్ వ్యాఖ్యలు చేశారని సజ్జల రామకృష్ణారెడ్డి గుర్తుచేశారు. అలాగే ఏపీలో పాఠశాలలు తెలంగాణలో పాఠశాలలో పరిశీలిస్తే అభివృద్ధి ఎక్కడ జరిగిందో అనేది పూర్తిగా అర్థమవుతుందన్నారు. తద్వారా గతంలో ఏపీలో అభివృద్ధిని గుర్తించి ఇప్పుడు ఎన్నికల నెపంతో విమర్శలు చేస్తారా అని సజ్జల ప్రశ్నించారు.