
నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి సైబర్ క్రైమ్ వలలో చిక్కుకున్నాడు. హైదరాబాదులో ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ ఐపిఎస్‌గా శిక్షణ తీసుకుంటున్న బాధితుడికి సడన్‌గా వాట్సప్‌లో వీడియో కాల్ వచ్చింది. తనకి తెలియని నంబర్ నుండి వీడియో కాల్ రావడంతో అతను అనుమానంగానే లిఫ్ట్ చేశాడు. ట్రైనింగ్ ఐపీఎస్ కాల్ లిఫ్ట్ చేయగానే ఒక యువతి న్యూడ్‌గా కనిపిస్తూ ఉన్న వీడియో ప్రత్యక్షమైంది. దీంతో కొన్ని సెకన్ల వ్యవధిలోనే ఆయన కాల్ కట్ చేశాడు.
అయితే ఈలోపే బాధితుడు కాల్ లిఫ్ట్ చేసిన కొన్ని సెకండ్లలోనే బాధితుడి వాట్సాప్‌కు సందేశం వచ్చింది. ఆయన కనిపిస్తున్న వీడియోను మార్పు చేసి సోషల్ మీడియాతో పాటు అన్నింటిలోనూ వైరల్ చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. అలా జరగకుండా ఉండాలంటే తాము చెప్పిన విధంగా లక్షల రూపాయలను తమ బ్యాంకు ఖాతాలో చెల్లించాలని వారు హెచ్చరించారు. దీంతో అవాక్కైన సదరు ఐపీఎస్ అధికారి సైబరాబాద్‌లో ఉన్న సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. గతంలోనూ ఇలాంటి న్యూడ్ కాల్స్ కేసులు ఎన్నో వెలుగు చూసాయి. అయితే ఇలాంటి తెలియని నంబర్ల నుండి కాల్స్ వచ్చినా, వీడియో కాల్స్ వచ్చినా ఎట్టి పరిస్థితుల్లో వాటికి దూరంగా ఉండాలని పోలీసులు పదేపదే హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఇండియన్ టైమింగ్స్ ప్రకారం రాత్రి వేళలో ఇలాంటి కాల్స్ అధికంగా వస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు.