ఫుట్‌బాల్ మైదానంలో మృతుల ఖననం..

Share On

ఇజ్రాయిల్ భూభాగంలోకి చొరబడి అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు అక్కడి ప్రజల్ని క్రూరంగా ఊచకోత కోశారు. ఈ దాడిలో 1400 మంది చనిపోయారు. 200 మందిని బందీలుగా హమాస్ మిలిటెంట్లు గాజాలోకి పట్టుకెళ్లారు. హమాస్ చేసిన పని ప్రస్తుతం గాజాలోని పాలస్తీనియన్ల పాలిట నరకంగా మారింది. ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్ పై జరిపిన దాడిలో 10,500 మందికి పైగా మరణించారు. ముఖ్యంగా గాజా నగరంతో పాటు ఉత్తర గాజాలోని చాలా భవనాలు నేలమట్టం అయ్యాయి. వైమానిక దాడులతో విరుచుకుపడిన ఇజ్రాయిల్ ప్రస్తుతం భూతల దాడులను కూడా నిర్వహిస్తోంది. గాజాలో తాగునీరు, వైద్యం, ఆహారం, కనీస సౌకర్యాలు కూడా కరువయ్యాయి. ఇదిలా ఉంటే లెక్కకు మించి ప్రజలు చనిపోతుండటంతో మృతదేహాలను దహనం చేసేందుకు కనీసం చోటు కూడా లభించడం లేదు.

చాలా ప్రాంతాల్లో శ్మశానాలు నిండిపోయాయి. దీంతో ప్రజలు వారి తోటల్లో చనిపోయిన పిల్లల్ని పాతిపెడుతున్నారు. మహమూద్ అల్ మస్రీ అనే వ్యక్తి తన ముగ్గురు సోదరులను, వారి ఐదుగురు పిల్లల్ని సమీపంలోని సిట్రస్ తోటలో పాతిపెట్టారు. శ్మశాన వాటిక సరిహద్దు జోన్ లో ఉండటంతో పండ్ల తోటలో పాతిపెట్టాల్సి వచ్చిందని మస్రీ వెల్లడించారు. ఇప్పటికీ చాలా మృతదేహాలను ఆస్పత్రుల వెలుపల, రోడ్లపై, పార్కుల్లో, ఐస్ క్రీములను తీసుకెళ్లే ట్రక్కుల్లో ఉంచుతున్నారు. ఇవి చాలకపోవడంతో గాజాలోని ఫుట్‌బాల్ మైదానంలో సామూహికంగా ఖననం చేయాల్సి వస్తోంది. కార్లలో నింపుకునేందుకు ఇంధనం లేకపోవడంతో గాడిద బండ్లలో మృతదేహాలను తీసుకెళ్లే దయనీయ పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ఇజ్రాయిల్ ఉత్తర గాజాను ఖాళీ చేయాలని అక్కడి ప్రజలకు సూచించింది. లేకపోతే హమాస్ మిలిటెంట్లు ప్రజల్ని రక్షణ కవచాలుగా వాడుకునే అవకాశం ఉందని తెలిపింది. దీంతో లక్షల్లో ప్రజలు గాజా దక్షిణ ప్రాంతానికి వలస వెళ్లారు. యుద్ధం పాలస్తీనా ప్రజలకు మానవతా సంక్షోభాన్ని మిగుల్చుతోంది. 50,000 మంది కేవలం 4 టాయిలెట్లు అందుబాటులో ఉన్నాయంటే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.


Share On

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

English English Hindi Hindi Telugu Telugu