
రోజురోజుకు టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ, కొన్ని కంపెనీలు వర్కర్లకు జీతం ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందని, వారికి బదులుగా రోబోలనే వర్కర్లుగా నియమించుకుంటున్నాయి. అయితే రోబోలపై గుడ్డిగా ఆధార పడటం ప్రమాదకరమని తాజాగా జరిగిన ఒక సంఘటన తెలుపుతుంది. సౌత్ కొరియాలో మెషిన్ మాల్‌ఫంక్షన్ కారణంగా ఒక రోబో 40 ఏళ్ల కంపెనీ వర్కర్‌ను దారుణంగా చంపేసింది. దక్షిణ కొరియాలోని సౌత్ జియోంగ్‌సాంగ్ ప్రావిన్స్‌లో, వెజిటేబుల్ సార్టింగ్ ప్లాంట్‌లో ఈ రోబోను ఉంచారు. ఇది ఒకరి ప్రాణాలను పొట్టన పెట్టుకుంటుందని ఎవరూ ఊహించలేకపోయారు. రోబో తయారీలో భాగమైన ఓ వర్కర్, రాత్రి వేళలో రోబో సెన్సార్లను చెక్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సెన్సార్లతో బాక్సులను గుర్తించి కన్వేయర్ బెల్ట్‌లపై పెప్పర్ బాక్సులను ఉంచేలా ఈ రోబోను డిజైన్ చేశారు.
అయితే నవంబర్ 8న రోబో దగ్గరకు వచ్చిన మనిషిని వెజిటేబుల్ బాక్స్ అని కన్ఫ్యూజ్ అయింది. దీంతో అది వర్కర్‌ను పట్టుకుని కన్వేయర్ బెల్ట్‌పై పెట్టింది. బాక్స్ కిందపడిపోతుందేమోనని అది వర్కర్‌ను బెల్ట్‌పై బలంగా ఒత్తింది. దాంతో వర్కర్ ముఖం, ఛాతీ బెల్ట్‌లో పడిపోయి నుజ్జునుజ్జు అయినట్లు మీడియా తెలిపింది. ఇది గమనించి, అతడిని ఆసుపత్రికి తరలించినా, తీవ్రగాయాలతో మృతి చెందాడు.
ప్లాంట్ యజమాని ఈ సంఘటనపై విచారం వ్యక్తం చేశాడు. ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి అత్యంత కచ్చితమైన, సురక్షితమైన సిస్టమ్స్ డెవలప్ చేయాలని కోరాడు. ఇతర సంబంధిత అధికారుల సహకారంతో ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రోబోలో సాంకేతిక లోపాలు ఉన్నాయా లేదా భద్రతా సమస్యలు ఉన్నాయా లేదా హ్యూమన్ ఎర్రర్ ఉందా అనే దానిపై వారు ఆరా తీస్తున్నారు.
ఫ్యాక్టరీలో రోబో మనుషుల ప్రాణాలకు హాని తలపెట్టడం ఇదే మొదటిసారి కాదు. ఈ ఏడాది మార్చిలో దక్షిణ కొరియాలోని గున్సాన్‌లోని ఆటో విడిభాగాల కర్మాగారంలో మ్యానుఫ్యాక్చరింగ్ రోబో కారణంగా ఒక కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. గతేడాది ప్యోంగ్‌టెక్‌లోని మిల్క్ ఫ్యాక్టరీలో ఒక కార్మికుడిని రోబో నలిపేసి చంపేసింది. 1992, 2017 మధ్య యునైటెడ్ స్టేట్స్‌లో వర్క్‌ప్లేస్ రోబోలు కనీసం 41 మరణాలకు కారణమయ్యాయని ఇటీవలి అధ్యయనం వెల్లడించింది, అయితే ఈ సంఖ్య తక్కువగా అంచనా వేయబడింది.