
దేశ రాజధాని ఢిల్లీ నగరమంతా కాలుష్య కోరల్లో చిక్కుకుని తల్లడిల్లుతోంది. రోజు రోజుకూ కాలుష్య తీవ్రత మరింత ప్రమాదకర స్థాయికి చేరుతుండటంతో అక్కడి ప్రజల ప్రాణాలు ప్రశ్నార్థకంగా మారాయి. గురువారం ఉదయం ఢిల్లీ నగరం దట్టమైన కాలుష్యంతో నిద్ర లేచింది. నగరంలోని పలు ప్రాంతాల్లో కాలుష్య తీవ్రత ప్రమాదపుటంచులను తాకినట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వెల్లడించింది. ఇలా తీవ్ర స్థాయిలో కాలుష్యం నగరాన్ని కుదిపేయడం వరుసగా ఇది ఏడో రోజు అని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పేర్కొంది. గురువారం ఉదయం 7 గంటలకు బావనా ప్రాంతంలో గాలి నాణ్యత 442 పాయింట్లుగా నమోదుకాగా, ఆర్కే పురం 418, జహంగీర్‌పురీ 441, ద్వారకా 416,అలీపూర్ 415, ఆనంద్ విహార్ మరియు ఐటీఓ 412, ఢిల్లీ విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో గాలి నాణ్యత 401గా రికార్డు అయ్యింది.
ఇండియాగేట్ వద్ద ప్రజలు మాస్కులు ధరించి వ్యాయామం చేస్తున్న వీడియోలు ఒక్కింత కలవరపాటుకు గురిచేశాయి. ఈ కాలుష్యంలో శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉందంటూ ఓ అథ్లెట్ ఆవేదన వ్యక్తం చేశాడు. తాను బయటమాత్రమే ట్రైనింగ్ ఇస్తానని అలాంటప్పుడు శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బంది పడుతున్నట్లు వెల్లడించాడు. ఇదిలా ఉంటే ఢిల్లీకి వచ్చి శ్వాస తీసుకోవడమంటే.. పొగను లోపలికి పీల్చుకున్నట్లే ఉందని ఉత్తర్ ప్రదేశ్ నుంచి వచ్చిన ఓ వ్యక్తి చెప్పాడు. ప్రభుత్వం సత్వరమే తగు చర్యలు తీసుకుని పరిష్కారం కనుగొనాలని డిమాండ్ చేశాడు. సుదూర ప్రాంతాల నుంచి ఢిల్లీని చూసేందుకు వస్తున్న తమకు కాలుష్యం వేటుకు బలవుతున్నామని తమ ఆరోగ్యం క్షీణిస్తోందని ఆవేదన వెలిబుచ్చాడు. దీపావళి పండగ తర్వాత దేశంలోని 11 రాష్ట్ర రాజధాని నగరాల్లో 9 రాజధాని నగరాలు కాలుష్య కోరల్లో చిక్కుకుని తల్లడిల్లుతున్నాయని ఓ విశ్లేషణ పేర్కొంది. ఇక ఢిల్లీలో కాలుష్య తీవ్రతను ఎప్పటికప్పుడు సమీక్షించి చర్యలు చేపడుతున్నామని చెప్పారు ఆ రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్. కాలుష్య తీవ్రత మరింత ప్రమాదకర స్థాయికి చేరితే కృత్రిమ వర్షాలు, సరి-బేసి సంఖ్య ట్రాఫిక్ విధానం అమలు చేస్తామని వివరించారు. రానున్న మూడు రోజుల్లో పరిస్థితిని సమీక్షించి ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు.