
ఆదివారం (నవంబర్ 19)న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా ఇది పేరుగాంచింది. 1,32,000 ఈ స్టేడియం కెపాసిటీ. కాగా.. ఈ మ్యాచ్‌కు ముఖ్య అతిథిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఆయనతో పాటుగా పలువురు కేంద్రమంత్రులు, భారత మాజీ క్రికెటర్లు, వివిధ రంగాల సెలబ్రిటీలు మ్యాచును వీక్షించేందుకు రానున్నారు.
వాంఖడే వేదికగా బుధవారం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో టీమ్ఇండియా 70 పరుగుల తేడాతో న్యూజిలాండ్ పై విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. ఈ క్రమంలో టీమ్ఇండియా పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ సైతం టీమ్ఇండియా ప్రదర్శన పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ‘భారత జట్టుకు అభినందనలు. అత్యుత్తమ ప్రదర్శనతో విశేషమైన శైలిలో ఫైనల్స్‌లో అడుగుపెట్టింది. అద్భుతమైన బ్యాటింగ్, మంచి బౌలింగ్ మన జట్టుకు మ్యాచ్‌ను అందించింది. ఫైనల్ మ్యాచ్‌కు శుభాకాంక్షలు.’అని ప్రధాని మోదీ సెమీ ఫైనల్ మ్యాచ్ అనంతరం ట్వీట్ చేశారు. టీమ్ఇండియా ఇప్పటికే ఫైనల్ కు చేరగా.. ప్రత్యర్థి ఎవరు అనేది దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కోల్‌కతా వేదికగా జరుగుతున్న రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు ఫైనల్‌లో టీమ్ఇండియాతో తలపడనుంది.