
తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం అభ్యర్థులు నానా తంటాలు పడుతున్నారు. కార్తీక మాసం కావడంతో.. పొలిటికల్ లీడర్లు వనభోజనాలు తరహాలో కుల భోజనాలు ఏర్పాటు చేసి కులాల వారీగా ఓట్ల వేటలో పడ్డారు. మన కులపోళ్ల ఓట్లన్నీ ఫలానా నేతకే అంటూ ఏకంగా తీర్మానాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా బేధాభిప్రాయాలొచ్చి ఘర్షణలు కూడా జరుగుతున్నాయి. దీంతో తెలంగాణ రాజకీయాల్లో కుల రాజకీయాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆదిలాబాద్ రూరల్‌లో మున్నూరుకాపుల అత్యవసర సమావేశం జరిగింది. మూకుమ్మడిగా ఓట్లన్నీ ఒకే పార్టీకి వేయాలని నిర్ణయించేసింది కులసంఘం. బీఆర్ఎస్ అభ్యర్థి జోగు రామన్నను బలపర్చాలని తీర్మానం చేశారు. కానీ.. ఓ వర్గానికి చెందిన నేతల ఎంట్రీతో ఇక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. మరోవైపు, ఈ సమావేశంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు ప్రతిపక్ష నేతలు.
హన్మకొండ జిల్లాలో ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమావేశం జరిగింది. దేశంలో ఇమామ్‌లకు గౌరవ వేతనం ఇచ్చింది బీఆర్‌ఎస్ ప్రభుత్వం మాత్రమే అన్నారు హోం మంత్రి మహుమూద్ అలీ. కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే ప్రజలకు కష్టాలు తప్పవన్నారు. ఆదిలాబాద్ కాంగ్రెస్‌లో ఐతే కులాల వారీ సమావేశాలు చిచ్చు రేపాయి. బీసీ మహిళను శూర్పణఖ అని సంబోధించడంతో కాంగ్రెస్ అభ్యర్థి కంది శ్రీనివాస్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. కందికి వ్యతిరేకంగా, కాంగ్రెస్ రెబల్ అభ్యర్ధి సంజీవరెడ్డికి జైకొడుతూ తీర్మానాలు చేస్తున్నాయి కుల సంఘాలు. కంది శ్రీనివాస్‌రెడ్డికి ఓటు వేయొద్దంటూ ఓపెన్‌గానే పిలుపునిచ్చాయి బీసీ సంఘాలు. హనుమకొండ జిల్లాలో ఎరుకల ఆత్మగౌరవ సభ జరిగింది. ఈ సభకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు వరంగల్ వెస్ట్ బిఆర్ఎస్ అభ్యర్థి దాస్యం వినయ్ భాస్కర్. ఎరుకల సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తానని, ఇంట్లో వ్యక్తిగా అందుబాటులో ఉంటానని మాటిచ్చారు. భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈసారి గెలిస్తే 100 కోట్లు ఇవ్వాలని ఎరుక నేతలు కోరారు.