
టీడీపీ అధినేత చంద్రబాబుకు భారీ రిలీఫ్ దొరికింది. స్కిల్ కేసులో ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులోనే చంద్రబాబు ప్రస్తుతం మధ్యంతర బెయిల్ పైన ఉన్నారు. ఆరోగ్యానికి సంబంధిత కారణాలతో మధ్యంతర బెయిల్ కోర్టు మంజూరు చేసింది. ఇప్పుడు సుప్రీం కోర్టులో వాదనలు పూర్తయిన క్వాష్ పిటీషన్ పైన తీర్పు వెల్లడి కావాల్సి ఉంది. 53 రోజులు జైలులో రిమాండ్ లో ఉన్న చంద్రబాబుకు ఈ తీర్పు భారీ ఉపశమనంగా మారనుంది.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో గత వారమే విచారణ పూర్తి చేసింది. స్కిల్ కేసులో సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించగా, చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. ఎన్నికల ముంగిట చంద్రబాబును కక్షపూరితంగా అరెస్ట్ చేశారని లూథ్రా వాదించారు. చంద్రబాబు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని కోర్టుకు వివరించారు. చంద్రబాబును ఇరికించడం కోసమే ఫోరెన్సిక్ రిపోర్టు తయారు చేశారని లూథ్రా ఆరోపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏ1 నిందితునిగా ఉన్న సీమెన్స్ కంపెనీ ప్రతినిధి చంద్రకాంత్‌షా అప్రూవర్‌గా మారారు. చంద్రకాంత్‌ను డిసెంబర్ 5న హాజరుకావాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ డిసెంబర్ 5కు వాయిదా వేసింది. చంద్రబాబు ప్రస్తుతం కంటికి శస్త్ర చికిత్స చేయించుకుని హైదరాబాద్ లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇక ఇప్పుడు ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయటంతో భారీ రిలీఫ్ దొరికింది. రాజకీయంగానూ కీలకంగా మారుతోంది. బెయిల్ మంజూరు విషయంలో కోర్టు ఏమైనా కండీషన్లు విధించిందా అనేది స్పష్టత రావాల్సి ఉంది.