
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల ప్రచారం తారాస్థాయికి చేరింది. మూడు ప్రధాన పార్టీలు గెలుపుపై ధీమాగా ఉన్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది. కాంగ్రెస్ నేతలు తమదే అధికారం అంటూ పూర్తి విశ్వాసంతో కనిపిస్తున్నారు. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ కీలక నేతలతో ఎన్నికల వ్యూహాలపై చర్చించారు. ఖచ్చితంగా 85 సీట్లలో గెలుస్తున్నామని చెప్పుకొచ్చారు.తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్- బీఆర్ఎస్ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ మారింది. సర్వే సంస్థలు ప్రజాభిప్రాయం తెలుసుకొనేందుకు పోటీలు పడుతున్నాయి. ఎన్నికల కోడ్ కారణంగా సర్వేలు బయట పెట్టకపోయినా.. పార్టీలకు పూర్తి సమాచారం ఇస్తున్నాయి.
కాంగ్రెస్ తమదే అధికారం అనే ధీమాతో ఉంది. ఒక విధంగా తప్పకుండా అధికారంలోకి వస్తుందన్న ప్రగాఢ నమ్మకం పార్టీని కమ్మేసింది. ఇటు కేసీఆర్ గతం కంటే భిన్నంగా ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. తనదైన డైలాగులు..పంచ్ లు..సెంటిమెంట్ అస్త్రాలు కనిపించటం లేదు. ప్రధానంగా పదేళ్ల కాలంలో తెలంగాణ కోసం తీసుకున్న నిర్ణయాలు..కరెంటు గురించి కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలు… ధరణి పోర్టల్ గురించే వివరిస్తున్నారు. ఓటు గురించి ఆలోచన చేయమని సూచిస్తున్నారు.
కాంగ్రెస్ నేతలు కేసీఆర్ లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు. దొరల పాలన పోవాలి… ప్రజల పాలన రావాలని ఎన్నికల నినాదంగా మార్చుకుంటున్నారు. పార్టీ నాయకత్వం ఢిల్లీ, బెంగళూరు నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. బీజేపీ కోసం ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాతో పాటుగా బీజేపీ ముఖ్య నేతలు ప్రచారం చేస్తున్నారు. బీసీ సీఎం నినాదం, ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా చేసిన ప్రకటన తమకు కలిసి వస్తుందని బీజేపీ నమ్ముతోంది. కాంగ్రెస్ పూర్తి భరోసాతో ఉందనే అభిప్రాయం వేళ.. సీఎం కేసీఆర్ మాత్రం అధికారం ఖాయమని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో అప్పుడే సీఎం సీటు కోసం నేతలు పోటీ పడుతుండటం ప్రజలు గమనిస్తున్నారని.. కర్ణాటక పాలన గురించి చెప్పటం ద్వారా.. అక్కడ ఎన్నికల తరువాత చోటు చేసుకున్న సీఎం సీటు పోరాటం వాళ్లకు గుర్తుకు వస్తోందని గులాబీ నేతలు చెబుతున్నారు.
కేసీఆర్ చేయించిన సర్వేల్లో బీఆర్ఎస్ అధికారంలోకి రావటం ఖాయమని తేలిందని పార్టీ నేతల అంటున్నారు. ప్రచారం చేస్తున్నట్లుగా 90 సీట్లు రాకపోయినా..75 సీట్లు ఖాయమని ఇప్పటికీ ధీమాగా చెబుతున్నారు. తెలంగాణలో ఎన్నికలు ప్రస్తుతం కేసీఆర్ ను గెలిపించాలి – కేసీఆర్ ను ఓడించాలి అనే అంశం పైనే జరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. అంతకు మంచి కాంగ్రెస్ సంక్షేమం.. ముఖ్య నేతల ప్రచారం ప్రజలను ఆకట్టుకోవటం లేదనేది వారి విశ్లేషణ. పదేళ్ల పాలన, కుటుంబ పాలన ఆరోపణలతో సహజంగా కనిపిస్తున్న వ్యతిరేకత.. కాంగ్రెస్ తమ అనుకూలతగా భావిస్తోందని చెబుతున్నారు. కర్ణాటకలో సంక్షేమ పథకాల అమలు వైఫల్యాలు తమ ఎంత బలంగా తీసుకెళ్తే అంత కలిసి వస్తుందని బీఆర్ఎస్ తాజా నిర్ణయం. కేసీఆర్ అనుభవం..సామర్ధ్యం తెలంగాణకు అవసరమని ప్రజలు మర్చిపోలేని పరిస్థితులు ఉన్నాయని.. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి 75 సీట్లు అనే నినాదం నిజమవుతుందని పార్టీ నేతలు చెబుతున్నారు. డిసెంబర్ 3న ప్రధాన పార్టీల భవితవ్యం బయటపడనుంది.