
తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ తరపున సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటుంటే, కాంగ్రెస్ రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వంటి జాతీయ నాయకులను రంగంలోకి దించి ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తుంది. బీజేపీ ప్రధాని మోడీ, అమిత్ షా లతో పాటు వివిధ రాష్ట్రాల సీఎంలను, కేంద్ర మంత్రులను రంగంలోకి దించింది. ఇక ఇదే సమయంలో బీజేపీ, జనసేన పొత్తుల నేపధ్యంలో పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికల ప్రచారానికి రంగంలోకి దిగారు. జనసేన అభ్యర్థుల తరపున మాత్రమే కాకుండా బీజేపీ అభ్యర్థుల తరపున కూడా ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నారు.
ఈ క్రమంలో ఆయన త్వరలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు రానున్నారు. ఈనెల 22న హన్మకొండకు రానున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ అభ్యర్థి కోసం ఎన్నికల ప్రచారం సాగించనున్నారు. బీజేపీ వరంగల్ పశ్చిమ అభ్యర్థి రావు పద్మకు మద్దతుగా ప్రచారంలో పాల్గొనున్న పవన్ కళ్యాణ్ భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్న బీజేపీ శ్రేణులు పవన్ కళ్యాణ్ చరిష్మా ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్కవుట్ అవుతుందని భావిస్తున్నారు.
రాష్ట్రంలో బీజేపీ – జనసేన కలిసి పోటీ చేస్తున్న తరుణంలో బీజేపీ, జనసేన అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం బీజేపీ, జనసేన అభ్యర్థులకు ఏ మాత్రం కలిసొస్తుంది అనేది తెలియాల్సి ఉంది. 22న పవన్ కళ్యాణ్ పర్యటనను విజయవంతం చేయడానికి ఇటు జనసైనికులు, అటు బీజేపీ శ్రేణులు సిద్ధం అవుతున్నారు. మరోవైపు కూకట్ పల్లి నియోజకవర్గంలో ఈనెల 26వ తేదీన పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. అక్కడ ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. కూకట్ పల్లి నియోజకవర్గం నుండి బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగిన ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ కు మద్దతుగా ప్రచారం జరుపుతారని రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.