సోషల్ మీడియా రోజురోజుకు పెరుగుతున్న కొద్ది ఎవరి సమాచారానికి కనీస భద్రత లేకుండా పోయింది. మంత్రులు, ఉన్నతాధికారుల డేటానే హ్యాకింగ్ అవుతుంటే ఇంకా ధరణిలో డేటా భద్రంగా ఉంటుందనే ప్రభుత్వం ఏలా చెపుతుందని, కేంద్రం ఆధీనంలో ఉన్న ఆధార్ డేటానే మూడుసార్లు బయటికొచ్చిందనే విషయం తెలంగాణ ప్రభుత్వానికి తెలియదా అంటూ హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీసింది. ఇప్పటివరకు ధరణి పోర్టల్‌లో నమోదైన డేటాను ఎక్కడ స్టోర్ చేశారని, దానిని ఎవరు పర్యవేక్షిస్తున్నరో చెప్పాలని అడిగింది. సదరు ఉన్నతాధికారి దగ్గరి నుంచో, ఆ ఆఫీసు నుంచో డేటా బయటికిపోదని గ్యారెంటీ ఏమిటని ప్రశ్నించింది. ధరణిలో ఆధార్‌తోపాటు కులం, ఫోన్ నంబర్ వంటి వ్యక్తిగత వివరాలు నమోదు చేయడం చట్టవిరుద్ధమని పేర్కొంటూ న్యాయవాది ఐ.గోపాల్‌శర్మ, కాశీభట్ల సాకేత్, కె.ఆనంద్‌కుమార్‌లు వేర్వేరుగా వేసిన పిల్స్‌ను బుధవారం చీఫ్ జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డిల ధర్మాసనం మరోసారి విచారించింది. నాన్ అగ్రికల్చరల్ ఆస్తుల వివరాలు నమోదు చేయరాదంటూ ఇచ్చిన స్టేను రద్దు చేయాలన్న అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చింది. పిల్స్‌పై విచారణను డిసెంబర్ 3కి వాయిదా వేస్తున్నామని, అప్పటివరకు స్టే కొనసాగుతుందని స్పష్టం చేసింది.