గత కొన్ని రోజులుగా తెలంగాణలోని కొన్ని జిల్లాలో పెద్దపులి తిరుగుతోందని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొన్ని గ్రామాల్లో పులి పశువులపై దాడి చేసి చంపిదని, ఎప్పుడు ఏ వైపు నుంచి వస్తుందో, ఎవరిపై దాడి చేస్తుందో అనే ఆందోళనల్లో ఆ జిల్లాల ప్రజలు వణుకుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెద్దపులి కలకలం సృష్టిస్తున్నది. జిల్లాలోని కృష్ణసాగర్ అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నది. గత కొన్ని రోజులుగా బూర్గంపహాడ్, అశ్వాపురం మండలాల్లో పెద్దపులి తిరుగుతున్నది. అశ్వాపురం మండలం రామచంద్రపురం, సారపాక ప్రాంతాల్లో పెద్ద పులి తిరిగినట్లు అటవీ అధికారులు ఆనవాళ్లు గుర్తించారు. ఈ రోజు ఉదయం రామచంద్రాపురం దోబీఘాట్ వద్ద పెద్దపులి అడగుజాడలు కన్పించాయని, దీంతో పాదముద్రల ఆధారంగా అది ఆడపులిగా గుర్తించారు. దీంతో సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పశువులను మేపడానికి అడవిలోకి వెళ్లకూడదని సూచించారు. నిన్న కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలం అగర్గూడ సమీపంలోని పెద్దవాగులో పెద్దపులి కనిపించింది. వాగు పరీవాహక ప్రాంతంలోని చేలల్లో పత్తి ఏరుతున్న కూలీలు సాయంత్రం నాలుగు గంటల సమయంలో పెద్దవాగులో పులి నీరుతాగుతుండగా గుర్తించారు. విషయం తెలుసుకున్న అటవీ అధికారులు పులి ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు. అగర్గూడ సమీపంలోని పెద్దవాగు ప్రాంతంలో పులి సంచరించిన విషయం వాస్తవమేనని ఎఫ్ఆర్వో తెలిపారు.