ఆసుపత్రులు అంటే ప్రజలకు సేవలందించాలి.. ప్రయివేట్ ఆసుపత్రులు ప్రభుత్వం విధించిన నిబంధనలు ప్రకారమే ఫీజులు వసూలు చేయాలి.. కాని నగరంలోని ఏ ఆసుపత్రి ప్రభుత్వ నిబంధనలు పాటించటం లేదు. ఎవరి ఇష్టానుసారంగా వారు లక్షల్లో బిల్లులు వసూలు చేస్తూ ప్రజలను దోచుకుంటున్నారు. ఐనా ప్రభుత్వం తమకేమి సంబంధం లేనట్లుగానే వ్యవహరిస్తోంది. హైదరాబాద్ నగరంలో పలు ఆసుపత్రులపై ఫిర్యాదులు వస్తున్నాయి. సన్‌షైన్ ఆసుపత్రిపై 14, కేర్‌పై 10, మెడీకవర్‌పై 8, కిమ్స్‌పై 13, విరించి ఆసుపత్రిపై 19 ఫిర్యాదులు వచ్చాయి. సోమాజిగూడ, సికింద్రాబాద్‌ల్లోని యశోద ఆసుపత్రులపై ఎక్కువ బిల్లులు వసూలు చేశారంటూ అత్యధికంగా 33 ఫిర్యాదులొచ్చాయి. యశోదపై ఇన్ని ఫిర్యాదులొచ్చినా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అర్థం కావడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేశాయంటూ డెక్కన్, విరించి ఆసుప్రతులపై మాత్రమే ఎందుకు చర్యలు తీసుకున్నారు, మరీ యశోద ఆసుపత్రిపై ఎందుకు తీసుకోవడం లేదు. ఆ ఆసుపత్రి అంటే ప్రభుత్వానికి ఎందుకంత ప్రేమ అని ప్రజారోగ్య విభాగం సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావును ధర్మాసనం ప్రశ్నించింది. ప్రైవేటు ఆసుపత్రులపై 276 ఫిర్యాదులు రాగా 154 పరిష్కరించామని, 122 పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారని, తదుపరి విచారణలోగా పెండింగ్‌లో ఉన్న 122 ఫిర్యాదులపై ఏం చర్యలు తీసుకున్నారో స్పష్టంగా నివేదికనివ్వాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.