చదువుకుంటేనే గొప్పవాడు అనుకుంటే అంతకన్నా పొరపాటు ఇంకొటి ఉండదు.. చదువులేకున్నా సమాజంలోని మంచి మార్పుల కోసం నిత్యం పరితపించే వారు ఎంతోమంది ఉంటారు. మనసులో మంచి చేయాలనే ఆలోచన ఉంటే చాలు ఎన్నో అధ్బుతాలు సృష్టించవచ్చు. ఎంతోమందికి స్పూర్తిగా మారవచ్చు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఒక వ్యక్తి మామూలు గొర్రెల కాపరి.. తన కోసం కాకుండా తన గ్రామం కోసం, రైతుల కోసం, పక్షులు, జంతువుల కోసం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 16 చెరువులను తవ్వించి లక్షలాది మందికి దేవుడిగా మారిన అతి సామాన్య గొర్రెల కాపరి కామెగౌడపై ముందడుగు ప్రత్యేక కథనం..
కర్ణాటకలోనీ మలవల్లి, కుండినిబెట్ట అనే చిన్న గ్రామంలో కామెగౌడ ఒక సామాన్య గొర్రెల కాపరి. ప్రతిరోజు గొర్రెలను, మేకలను కొండపైకి తీసుకెళుతూ మేపేవాడు. గొర్రెలకు మేకలకు నీళ్ల కోసం ఎక్కడ వెతికినా నీటి గుంటలు కనిపించలేదు. వాటికి ఎలాగైనా నీళ్లు అందించి దాహం తీర్చాలని నిర్ణయించుకున్నాడు. ఇక అప్పటినుండి గొర్రెలను మేపుతున్న సమయంలో తన దగ్గర ఉండే కర్రతో నీటి జాడలు ఉన్న ప్రదేశంలో తవ్వడం ప్రారంభించాడు. అలా కొన్ని నెలలు తవ్వి తవ్వి అలసిపోయాడు. ఎన్నో రోజులకు ఒక గుంటలో నీరు రావడం కనిపించింది. అలా వచ్చిన నీటితో మేకలకు గొర్రెలకు మొదట దాహం తీర్చాడు. ఆ గుంటలో నీరు రాగానే తనకు అనిపించింది ఇక్కడ నీటి జాడలు ఉన్నాయని, ఇంకా కొంచెం పెద్ద చెరువులు తవ్వాలని అనుకొని తాను తవ్వే పరికరాన్ని మార్చాలని అనుకొని, వెంటనే తన గొర్రెల్లోని రెండు గొర్రెలు అమ్మి ఇనుప వస్తువులు తీసుకొచ్చాడు. వాటితో మరలా గుంతను పెద్దగా చేశాడు.
అలా ఒక చెరువు తవ్విన కామెగౌడ మనసులో కొండపైన ఉన్నటువంటి జంతువులు, జీవరాశులు గుర్తుకు వచ్చాయి ఇలా అనేక చెరువులు తవ్వడం వల్ల జంతువులు అన్నిటికీ దాహం తీర్చాలని ఆలోచన వచ్చింది. వెంటనే తవ్విన చెరువుకు అనుసంధానం చేస్తూ ఇంకో చెరువు తవ్వడం మొదలు పెట్టాడు. ఇలా 2017 వరకు ఒక చెరువుకి ఇంకొక చెరువుని అనుసంధానిస్తూ 6 చెరువులు తవ్వాడు. ఆయన కృషికి, పట్టుదల తెలుసుకొని సినిమా హీరో కిచ్చా సుదీప్ అతనికి ఆర్థిక సహాయం చేశాడు. ఆ ఆర్థిక సహాయం మొత్తాన్ని కూడా కామెగౌడ మరో 6 చెరువులు తవ్వడానికి వినియోగించాడు. గొర్రెల కాపరైనా తనకున్న డబ్బును, తనకు ఇతరులు సహాయంగా అందించిన డబ్బునంతా కొండ మీద ఉన్న జంతువుల కోసం, పక్షుల కోసం అలాగే కొండ సంరక్షణ కోసం గుంతలు తవ్వి చెరువులు నిర్మించి ఒక దానికొకటి అనుసంధానిస్తూ 16 చెరువులు తవ్వాడు. కొండపైకి వెళ్లడానికి ఒంటరిగా రహదారిని కూడా నిర్మించాడు. 2018 కాలంలో అక్కడే రెండు వేల పైబడి మర్రి చెట్లను నాటాడు.
84 సంవత్సరాల వయస్సులో కూడా, కెరె కామెగౌడ ఆరోగ్యంగా ఉన్నాడు. కొండపైకి మరియు క్రిందికి సులభంగా ఎక్కి దిగుతాడు. మానవులు డబ్బు కోసం మరింత అత్యాశపరులుగా మారుతున్నప్పుడు, అతను మనకు నిజమైన మార్గాన్ని చూపుతున్నాడు అంటారు ఆ ప్రాంత ప్రజలు. అలాగే ‘కెరే’ అంటే ‘సరస్సు’ అని ముద్దుగా ఈ ప్రాంత ప్రజలంతా పిలుచుకుంటారు కామెగౌడను. చొక్కా, చడ్డీ మరియు శాలువతో ఉండే కెరెను ఎప్పుడైనా కొండ మీద చూడవచ్చు. అతని మనవడికి కూడా ఒక సరస్సు పేరు పెట్టి వాటి మీద ప్రేమను చాటుకున్నాడు.