నూతన వ్యవసాయ బిల్లుపై దేశ రాజధాని ఢిల్లీలో రైతులు అలుపెరగని నిరసన చేస్తున్నారు. రైతుల ఆందోళనలపై వారితో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా అన్నారు. అన్నదాతలకు సంబంధించిన ప్రతి సమస్య, డిమాండ్ పరిష్కారానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్న రైతులు ‘చలో దిల్లీ’ కార్యక్రమం చేపట్టారు. ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లలో నగరంలోనికి వచ్చారు. చట్టాలను వెనక్కి తీసుకొనే వరకు రాజధానిలోనే బైఠాయిస్తామని హెచ్చరించారు. వీరంతా ప్రధాన రహదారుల్లో నిరసన వ్యక్తం చేస్తుండటంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో విశాలమైన స్టేడియాల్లోకి వచ్చి శాంతియుతంగా నిరసన తెలియాలని రైతులతో పోలీసులు చర్చించారు. అందుకు సంసిద్ధత వ్యక్తం చేసినప్పటికీ ఇంకా కొందరు రైతులు రహదారులపైనే ఉన్నారు. నిరసనల్లో ఎక్కువగా పంజాబ్ రైతులే పాల్గొన్నారు.
రైతులు ఆందోళన చెయోద్దని, వారితో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అన్నదాతల ప్రతి సమస్య, డిమాండ్లను మేం పరిష్కరిస్తామన్నారు. డిసెంబర్ 3కు ముందే చర్చలు చేపట్టాలంటే వెంటనే నిరసనలు ఆపేయండి. మరుసటి రోజే సమావేశానికి నేను హామీ ఇస్తున్నానని అమిత్ షా రైతులకు విజ్ఞప్తి చేశారు.