సోష‌ల్ మీడియా వాడ‌కంపై త్వ‌ర‌లో మ‌రిన్ని ఆంక్ష‌లు

యువ‌త‌, పిల్ల‌లు సోషల్ మీడియా వాడకం మరింత సురక్షితంగా ఉండేలా చేయాలని ప్రయత్నిస్తున్నట్లు కేంద్ర ఐటీ మంత్రి ఆశ్విని వైష్ణ‌వ్‌ తెలిపారు. ఈ అంశంపై అశ్విని వైష్ణవ్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. యువత ఎస్ఎం వాడకం విషయంలో మరింత నియంత్రణ విధించాల్సిన అవసరం ఉందన్నారు.

వయసు ఆధారంగా యూజర్లపై ఆంక్షలు విధించే అంశంపై సోషల్ మీడియా సంస్థలతో ప్రభుత్వం నిరంతరం చర్చిస్తోంది. ఈ విషయంలో ఏది సరైంతో ఆలోచిస్తున్నాం. డీప్‌ ఫేక్ వంటి కొత్త టెక్నాలజీలు యువత సహా వినియోగదారులకు ప్రమాదకరంగా మారాయి. వినియోగదారుల్ని, సమాజాన్ని సోషల్ మీడియా దుష్ప్రభావం నుంచి రక్షించేలా చూడాలి. ఎస్ఎం సంస్థలు భారతీయ చట్టాలు, రాజ్యాంగ విలువల్ని పాటించాలి. ఎస్ఎం విషయంలో దేశంలో ఉన్న ప్రస్తుత చట్టాలు సరిపోవు. చట్టాల్ని మరింత కఠినతరం చేయాలి. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ అయిన నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, మెటా, ఎక్స్ వంటి సంస్థలు దేశ చట్టాల్ని అనుసరించాలి. ఇప్పటికే డీపీడీపీ యాక్ట్ వంటి చట్టాలు రూపొందించాం. పిల్లలు, యువతకు ఎస్ఎం వాడకం నియంత్రించే విషయంలో పార్లమెంట్ కమిటీ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలి. సమాజానికి రక్షణ కల్పించే రూల్స్ తేవాలి అని అశ్విని వైష్ణవ్ అన్నారు.