భూత‌గాదా.. కొడుకును చంపిన తండ్రి..

ఒడిశా రాష్ట్రం దెంకనాల్‌ జిల్లాకు చెందిన కిరోద్‌ సాహూ, బిభూటి సాహు అనే తండ్రీకొడుకుల మధ్య చాలాకాలంగా భూతగాదా నడుస్తోంది. ఈ క్రమంలో కిరోద్‌ సాహూను చంపేస్తానని తండ్రి బిభూటి సాహూ హెచ్చరించాడు. దాంతో కిరోద్‌ సాహూ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తన తండ్రి నుంచి తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

పోలీసులకు ఫిర్యాదు చేసి ఇంటికి వెళ్లిన కాసేపటికే తండ్రి బిభూటి సాహూ వచ్చి గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో గొడవ ముదిరింది. దాంతో ఆగ్రహానికి లోనైన బిభూటీ సాహూ కత్తితో కొడుకు కిరోద్‌ సాహూపై విచక్షణారహితంగా దాడిచేశాడు. పలుమార్లు పొడిచాడు. దాంతో కిరోద్‌ సాహూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు బిభూటి సాహూను అరెస్ట్‌ చేసి రిమాండ్‌ తరలించారు.