సీజేపీ నేత‌లు అశుతోష్ రాంకా, సౌర‌వ్ దాస్‌లు శుక్ర‌వారం ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ఎదుట విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. అక్టోబ‌ర్ 13న ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద జ‌రిగిన ఆందోళ‌న సంద‌ర్బంగా నిబంధ‌నలు ఉల్లంఘించ‌డం వంటి అంశాల‌పై పోలీసులు ఇద్ద‌రికీ బుధ‌వారం స‌మ‌న్లు జారీ చేశారు. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ ఎదుట విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని ఆదేశించారు. దీంతో రాంకా, దాస్ శుక్ర‌వారం విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడారు. నాయ‌కులు అరెస్టైతే ఉద్య‌మం ఎలా కొన‌సాగిస్తారు అంటూ మీడియా ప్ర‌శ్నించ‌గా.. త‌మను అరెస్టు చేసినంత మాత్రాన ఉద్య‌మం ఆగ‌దని స్ప‌ష్టం చేశారు. తమ అరెస్టుల వ‌ల్ల త‌మ గురించి మ‌రింత‌గా తెలుసుకునేందుకు అవ‌కాశం దొరికంద‌న్నారు. అలాగే, వ్య‌వ‌స్థ‌లు ఎలా ప‌ని చేస్తాయో కూడా అర్థ‌మైంద‌న్నారు. తాము నాయ‌కులం కాద‌ని, దేశ ప్ర‌జ‌లు త‌మ‌కు అందించిన వ్య‌వ‌స్థ‌కు సంర‌క్ష‌కులం మాత్ర‌మే అన్నారు.

త‌మ వ‌ల్ల అయినంత మంచి చేయాల‌నేదే త‌మ తాప‌త్ర‌య‌మ‌ని వివ‌రించారు. తాముకానీ, త‌మ పార్టీ నేత‌లు కానీ జైలులో ఉన్నా.. బ‌య‌ట ఉన్నా ఉద్య‌మం మాత్రం కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. సీఈసీ రాజీనామా కోరుతూ సీజేపీ చేప‌ట్టిన ఆందోళ‌న సంద‌ర్బంగా నిబంధ‌న‌లు ఉల్లంఘించార‌నే కార‌ణంతో అక్టోబ‌ర్ 13న రాంకా, దాస్‌ల‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. వారికి కోర్టు జుడీషియ‌ల్ క‌స్ట‌డీ విధించ‌డంతో వారం రోజుల‌కుపైగా తిహార్ జైలులో ఉన్నారు. గ‌త బుధ‌వారం వారికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అదే రోజు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇద్ద‌రికీ మ‌ళ్లీ వేరే కేసులో నోటీసులు జారీ చేశారు.