ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎల్‌నినో ప‌లు దేశాలను వ‌ణికిస్తోంది. వ‌ర్షాలు ప‌డ‌క‌, పంట‌లు పండ‌క నేడు బియ్యం ధ‌ర‌లు మండిపోతున్నాయి. నేడు భార‌త‌దేశంలోని వివిధ రాష్ట్రాల్లో సన్న రకం బియ్యం రిటైల్ ధర కిలో రూ.85 నుంచి రూ.90 వరకు చేరుకున్నాయి. గత 30 నుంచి 45 రోజుల్లోనే 25 కిలోల బస్తాపై రూ.300 నుంచి రూ.500 వరకు బియ్యం ధరలు పెరగడంతో సామాన్యులు లబోదిబోమంటున్నారు. గత నెలలో రూ.1,800 ఉన్న బియ్యం బస్తా ధర ప్రస్తుతం రూ.2వేలు దాటిందని సామాన్యులు ఆందోళ‌న చెందుతున్నారు.

గతంలో రూ.1,500 ఉన్న 25 కిలోల బియ్యం బస్తా ఇప్పుడు రూ.1,900కి చేరిందని వాపోతున్నారు. స్టీమ్ రైస్ బస్తా రూ.1,600 నుంచి రూ.2,200 వరకు పెరిగింది. ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో బ్రాండ్లు, ప్యాక్ సైజ్ ఆధారంగా ధరల్లో వ్యత్యాసాలు కనిపిస్తున్నప్పటికీ.. సామాన్యులకు ఇది మోయరాని భారంగా మారుతోందని చెబుతున్నారు. అయితే బియ్యం ధరలే కాదు.. ఉల్లి, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, కూరగాయల ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. అటు ఉప్పులు, పప్పులు ధరలు కూడా భారీగానే ఉన్నాయి. పల్లిలు ధరలు కూడా భారీగానే ఉన్నాయి. కిలో రూ.180 నుంచి రూ.190 పలుకుతున్నాయి.

పశ్చిమాసియా ఉద్రిక్తత నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ కు 100 డాలర్ల పైనే కొనసాగుతోంది. ఇండియన్ ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచకుండా నష్టాలను భరిస్తున్నారు. అయితే త్వరలోనే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరుగుతాయి. దీంతో నిత్యావసరాలు, కూరగాయల ధరలు పెరుగుతాయి. ఎల్పీజీ ధరలు పెరిగితే టిఫిన్ సెంటర్లలో టిఫిన్ల ధరలు పెరుగుతాయి. దీంతో సామాన్యుడు బతకడం కష్టంగా మారుతుందని అంచనా వేస్తున్నారు.