రూ. 20 రూపాయ‌ల వాట‌ర్ బాటిల్ కోసం ఓ మ‌నిషి ప్రాణం తీసిన‌ ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులోని ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో పనిచేసే నల్గొండకు చెందిన మాస సాయికుమార్ (33)కు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడున్నారు. సాయికుమార్ వారం క్రితం ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వాహకులకు విశాఖపట్నం వెళ్తున్నానని చెప్పి వెళ్లాడు. ఈ క్రమంలో సాయికుమార్ ఈ నెల 18న అర్ధరాత్రి దాటాక విజయవాడ పటమటలో ఓ మద్యం దుకాణం వద్ద ఉన్న పాన్ షాపులోని ఫ్రిజ్ నుంచి రూ.20 వాటర్ బాటిల్ తీసుకునేందుకు ప్రయత్నించాడు.

అది గమనించిన పాలు సరఫరా చేసే వాహనం డ్రైవర్ సాయికుమార్‌ను పట్టుకొని పాన్ షాపులో పనిచేసే రవిశంకర్‌కు అప్పగించి వెళ్లిపోయాడు. రవిశంకర్‌తోపాటు బార్‌లో పనిచేసే అయ్యప్పశంకర్ సాయికుమార్‌ను పిడిగుద్దులు గుద్ది, విచక్షణారహితంగా కొట్టి, నేలపై ఈడ్చుకుంటూ దుకాణానికి వెనుక ఉన్న సందులోకి తీసుకెళ్లారు. అటుగా వెళ్తున్న పోతంశెట్టి నవీన్, సాయిప్రణీత్ కూడా వీరికి తోడయ్యారు. నలుగురూ కలిసి సాయికుమార్‌పై విచక్షణారహితంగా దాడి చేశారు. భార్యాపిల్లలున్నారని.. తనను విడిచిపెట్టాలని సాయికుమార్‌ వేడుకున్నా నలుగురు వ్యక్తులు కనికరించ‌లేదు. అతని చేతులను వెనక్కి విరిచి విద్యుత్తు స్తంభానికి కట్టేసి, కర్రలతో తీవ్రంగా కొట్టారు. తీవ్రగాయాలతో సాయికుమార్ అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దాడి చేసిన నలుగురు వ్యక్తులు పరారయ్యారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు సీసీ కెమెరాల ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.