భార్యాభర్తల మధ్య భరణం వివాదానికి సంబంధించి కలకత్తా హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. భర్త కంటే భార్య ఎక్కువ ఆదాయం సంపాదిస్తూ, తనకు ఎలాంటి ఆదాయం లేదంటూ కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చి భరణం పొందేందుకు ప్రయత్నిస్తే అటువంటి ఉత్తర్వులను రద్దు చేయవచ్చని స్పష్టం చేసింది. అంతేకాకుండా, వాస్తవాలను దాచిపెట్టి కోర్టును తప్పుదోవ పట్టించిన భార్యకు రూ.20 వేల జరిమానా కూడా విధించింది.
నెలకు రూ.45 వేల భరణం.. చివరకు రద్దు!
కేసు వివరాల్లోకి వెళ్తే.. శ్రీమతి ఘోష్ 2022లో తనకు ఎలాంటి ఆదాయం లేదని, వృద్ధులైన తల్లిదండ్రులపై ఆధారపడి జీవిస్తున్నానని పేర్కొంటూ భర్త నుంచి నెలకు రూ.1.80 లక్షల భరణం కోరారు. ఈ పిటిషన్‌ను విచారించిన సీల్దా మేజిస్ట్రేట్ కోర్టు తొలుత నెలకు రూ.20 వేల భరణం చెల్లించాలని ఆదేశించింది. అనంతరం 2024 మార్చి 30న ఆ మొత్తాన్ని రూ.45 వేలకు పెంచింది. అయితే, తన భార్య బెంగళూరులోని విప్రో సంస్థలో ఉద్యోగం చేస్తూ నెలకు లక్షన్నరకు పైగా సంపాదిస్తోందని, తన ఆదాయ వివరాలను ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టిందని ఆరోపిస్తూ భర్త కలకత్తా హైకోర్టును ఆశ్రయించారు.
ఇద్దరి జీతాల వివరాలు పరిశీలించిన న్యాయస్థానం
విచారణ సందర్భంగా ఇరువురి ఆర్థిక వివరాలను హైకోర్టు పరిశీలించింది. భర్త కాగ్నిజెంట్ సంస్థలో పనిచేస్తూ నెలకు రూ.1.15 లక్షలు సంపాదిస్తున్నట్లు తేలింది. ఇందులో రూ.40,349 రుణ వాయిదాల (EMI) రూపంలో చెల్లిస్తున్నట్లు వెల్లడైంది. మరోవైపు భార్య సమర్పించిన జీతం పత్రాలను పరిశీలించగా.. 2026 జూన్‌లో రూ.1,47,782, జూలైలో రూ.1,51,313, ఆగస్టులో బోనస్‌తో కలిపి రూ.1,75,594 వేతనం అందుకున్నట్లు బయటపడింది. దీంతో ఆమెకు స్వతంత్ర ఆదాయం లేదన్న వాదనలో వాస్తవం లేదని కోర్టు గుర్తించింది. తన న్యాయవాదితో జరిగిన అపార్థం కారణంగానే గృహిణిగా పేర్కొనాల్సి వచ్చిందని భార్య చెప్పిన వివరణను ధర్మాసనం అంగీకరించలేదు. తన భర్త ఈమెయిల్ ఖాతాలను హ్యాక్ చేశాడన్న ఆరోపణకూ తగిన ఆధారాలు లేవని పేర్కొంది.
భరణం ఉత్తర్వులు రద్దు.. రూ.20 వేల జరిమానా
భార్యకు బీటెక్, ఎంసీఏ వంటి ఉన్నత విద్యార్హతలతో పాటు మంచి ఉద్యోగం, గణనీయమైన ఆదాయం ఉన్న విషయాన్ని ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. తన ఆర్థిక పరిస్థితిని దాచిపెట్టి భరణం పొందేందుకు ప్రయత్నించడం కోర్టును తప్పుదోవ పట్టించడమేనని జస్టిస్ చైతాలి చటర్జీ దాస్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ట్రయల్ కోర్టు విధించిన నెలకు రూ.45 వేల భరణం ఉత్తర్వులను రద్దు చేస్తూ తీర్పునిచ్చారు. అంతేకాకుండా, రూ.20 వేల జరిమానాను 10 రోజుల్లోగా జువెనైల్ జస్టిస్ కమిటీకి చెల్లించాలని ఆదేశించారు.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!