భార‌త్‌కు చెందిన వైద్య విద్యార్థి బంగ్లాదేశ్‌లో ఎంబీబీఎస్‌ చదువుతూ అదృశ్య‌మై, రెండు రోజుల తర్వాత మెడికల్‌ కాలేజీ సమీపంలోని చెరువులో శ‌వ‌మై క‌నిపించాడు. కుమారుడితో పాటు బంగ్లాదేశ్‌లో ఉంటున్న తల్లి అతడి మరణ వార్త తెలుసుకుని ఆసుపత్రిపాలైంది. జమ్ముకశ్మీర్‌లోని సోపోర్‌కు చెందిన 26 ఏళ్ల అద్నాన్ అల్తాఫ్, బంగ్లాదేశ్‌లోని ఈస్టర్న్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్‌ చదువుతున్నాడు. ఇటీవల కశ్మీర్‌కు వచ్చిన అతడు 15 రోజుల కిందట తల్లితో కలిసి చదువు కోసం తిరిగి బంగ్లాదేశ్‌ వెళ్లాడు. నవంబర్‌ 2న క్యాంపస్‌ నుంచి అద్నాన్‌ బయటకు వెళ్లాడు. అక్కడి ఇండియన్‌ రెస్టారెంట్‌లో డిన్నర్‌ చేశాడు. ఆ తర్వాత అతడు అదృశ్యమయ్యాడు. ఢాకా-చటోగ్రామ్ హైవేలోని మెడికల్‌ కాలేజీ సమీపంలో ఉన్న మోనిపూర్ గ్రామంలోని చెరువులో భారత విద్యార్థి మృతదేహం లభించింది. పోస్ట్‌మార్టం పరీక్ష కోసం కమిల్లా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు.

మరోవైపు అద్నాన్ కొంత కాలంగా మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని ఈస్టర్న్ మెడికల్‌ కాలేజీ యాజమాన్యం తెలిపింది. కుమారుడిని చూసుకునేందుకు తల్లి కూడా అతడితో పాటు ఉంటున్నట్లు పేర్కొంది. 15 రోజుల క్రితమే వారిద్దరూ భారత్‌ నుంచి బంగ్లాదేశ్‌కు తిరిగి వచ్చినట్లు వివరించింది. నవంబర్ 4 నుంచి ప్రారంభం కావాల్సిన రెండో ప్రొఫెషనల్ ఎంబీబీఎస్ మైక్రోబయాలజీ పరీక్షలకు అద్నాన్ హాజరు కావాల్సి ఉన్నదని కాలేజీ అధికారులు వెల్లడించారు.