కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ ప్ర‌ధాని మోడీ బ‌హిరంగ చ‌ర్చ‌కు రావాల‌ని చేస్తున్న డిమాండ్‌ను కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తప్పుపట్టారు. రాజకీయ చర్చను వీధుల్లో పెట్ట‌కూడ‌ద‌ని, పార్లమెంట్‌లో పెట్టాలని ఆయ‌న కౌంట‌ర్ వేశారు. ప్రభుత్వం నుంచి వచ్చే సమాధానాలను రాహుల్‌గాంధీ తట్టుకోలేరని ఎద్దేవాచేశారు. బాధ్యతాయుతమైన చర్చ జరగాలని మీరు అనుకుంటే, మీ ఆందోళనల్లో సత్యం, తర్కం ఉంటే రండి పార్లమెంట్‌లో చర్చించుకుందాం అని స‌వాల్ చేశారు. ఎదురెదురుగా కూర్చుని మాట్లాడుకుందాంగానీ మా సమాధానాలను మీరు తట్టుకోలేరని రాహుల్‌గాంధీని ఉద్దేశించి అన్నారు. ఎప్పటిలాగే ఇప్పుడు కూడా పారిపోతారని ఎద్దేవాచేశారు. పార్లమెంట్ కార్యకలాపాలకు అంతరాయం కలిగించడమే కాంగ్రెస్‌ పనిగా పెట్టుకుందని విమ‌ర్శించారు.

బాయ్‌కాట్‌లను రాజకీయ వ్యూహంగా మార్చుకుందని విమ‌ర్శించారు. పార్లమెంట్‌లో కీలకమైన చర్చలను తప్పించుకుంటున్నార‌ని, గందరగోళం సృష్టించేందుకు వీధుల్లో జనాలను సమీకరించుకుంటున్నారని హర్యానాలో జరిగిన ఓ స‌భ‌లో అమిత్‌ షా మండిపడ్డారు.