వరంగల్: నర్సంపేట మండలం రాజేశ్వరావు పల్లి గ్రామంలో కుటుంబ తగాదాల నేపథ్యంలో పేద కుటుంబాలకు చెందిన రెండు ఇళ్లను జేసీబీతో కూల్చివేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన శనివారం ఉదయం సుమారు 11 గంటల సమయంలో చోటుచేసుకున్నట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. కీసరి రాజేష్ రావు, కీసర ఇంద్రయ్యలపై బాధిత కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తూ, తమకు ఎవరూ లేని సమయంలో జేసీబీ తీసుకొచ్చి ఇళ్లను కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని రోజులుగా కుటుంబ తగాదాలు కొనసాగుతున్నాయని, గ్రామ పెద్దలు ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని గ్రామస్థులు చెబుతున్నారు.
ఇళ్లలో ఉన్న విలువైన వస్తువులు, నగదు, ధ్రువపత్రాలు, దేవుళ్ల విగ్రహాలు తదితర సామగ్రి ధ్వంసమైందని బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. కష్టపడి నిర్మించుకున్న తమ నివాసాలు కళ్లముందే కూలిపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నామని వారు వాపోయారు. గతంలో కూడా ఇదే తరహాలో ఇల్లు కూల్చివేసిన ఘటనపై నర్సంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ సరైన స్పందన రాలేదని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరోసారి ఇళ్లను కూల్చివేయడంతో తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకం కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సంబంధిత పోలీసు అధికారులు స్పందించి సమగ్ర విచారణ చేపట్టి, బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని, ఇళ్లను కూల్చివేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!